ఆయుధాలు వీడి.. విద్యా బాటలో విజయం

by Batti.Sumithra |

ఒకప్పుడు అడవుల్లో తిరుగుతూ మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న మహిళ, నేడు విద్య ద్వారా తన జీవితానికి కొత్త దిశను చూపిస్తూ ఆదర్శంగా నిలిచారు.

ఆయుధాలు వీడి.. విద్యా బాటలో విజయం
X

దిశ, వీపనగండ్ల : ఒకప్పుడు అడవుల్లో తిరుగుతూ మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న మహిళ, నేడు విద్య ద్వారా తన జీవితానికి కొత్త దిశను చూపిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు విజయ అలియాస్ ఎత్తం చిట్టెమ్మ ఇటీవల ప్రకటించిన పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో 384 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. విజయ చిన్ననాటి నుంచే చదువు పై ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ, కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, అనివార్య కారణాల వల్ల ఆమె విద్యాభ్యాసం మధ్యలోనే నిలిచిపోయింది. అనంతరం జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అడవి బాట పట్టి మావోయిస్టు ఉద్యమంలో చేరారు. కొన్నేళ్ల పాటు ఆ మార్గంలో కొనసాగిన ఆమె, తర్వాత ప్రభుత్వ పునరావాస విధానాల పట్ల ఆకర్షితురాలై ఆయుధాలను వీడి సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చారు. జనజీవన స్రవంతిలో కలిసిన అనంతరం విద్య ద్వారానే జీవితంలో పురోగతి సాధించవచ్చని భావించిన విజయ మళ్లీ చదువు పై దృష్టి సారించారు. ఎంతో కష్టపడి, పట్టుదలతో పదో తరగతి పరీక్షలకు సిద్ధమై సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 384 మార్కులు సాధించి మంచి ఫలితాన్ని నమోదు చేశారు.

ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ విద్య మనిషి జీవితాన్ని మార్చగల గొప్ప ఆయుధం. గతాన్ని పక్కనబెట్టి భవిష్యత్తును నిర్మించుకోవాలనే సంకల్పంతో మళ్లీ చదువు ప్రారంభించాను. నా వంటి వారు కూడా విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించాలనుకుంటున్నాను అని తెలిపారు. విజయ సాధించిన ఫలితం పై స్థానిక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని అందుకోవచ్చని ఆమె నిరూపించారని కొనియాడారు. మాజీ మావోయిస్టుగా ఉన్న స్థితి నుంచి విద్యార్థినిగా మారి చదువులో రాణించడం యువతకు, ముఖ్యంగా చదువు మధ్యలో నిలిపివేసిన వారికి స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు. విజయ విజయం పునరావాసం పొందిన మాజీ మావోయిస్టులకు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆశాజ్యోతి వంటిదని పలువురు పేర్కొన్నారు. విద్యతో కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలనే ఆమె సంకల్పం మరెందరికో మార్గదర్శకంగా నిలవనుంది అలాగే తన కూతురు నేను ఒకేసారి పాస్ కావడంతో విద్యాశాఖ, పోలీస్ అధికారులు, సన్నిహితుల నుంచి ప్రశంసలు వెళ్ళువెత్తడం సంతోషంగా ఉందని అన్నారు.

Next Story