జాతీయ రహదారి పనులతో ప్రజలకు ఇబ్బందులు

by Ratna Kumari |

మండలంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి-765డి విస్తరణ పనులు అస్తవ్యస్తంగా సాగుతుండడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జాతీయ రహదారి పనులతో ప్రజలకు ఇబ్బందులు
X

దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి-765డి విస్తరణ పనులు అస్తవ్యస్తంగా సాగుతుండడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల్లో జాప్యం, హెచ్చరిక బోర్డులు, సూచికలు లేకపోవడం వల్ల రాకపోకలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న రహదారిపై వాహనాలు సంచరిస్తుండటంతో దుమ్ము దూళి విపరీతంగా ఎగసిపడుతూ ప్రయాణికులతో పాటు రహదారి పక్కన నివసించే ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి సర్వీస్ రోడ్డంతా నీటితో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.

ప్రధాన రహదారి పనులు చేపట్టే ముందు ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి ఉంటే ఈ ఇబ్బందులు తలెత్తేవి కావని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంట్రాక్టర్ సర్వీస్ రోడ్లను పూర్తి చేయకుండానే ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టడంతో భారీ వాహనాల రాకపోకల కారణంగా సర్వీస్ రోడ్డుపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడి ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు సర్వీస్ రోడ్లను వెంటనే పూర్తి చేసి, హెచ్చరిక బోర్డులు, భద్రతా సూచికలు ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Next Story