హుబ్బళ్లి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు

by Malleboina Mahesh |

ఓ పార్టీ మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో ఆమెపై దాడి చేయడమే కాకుండా, ఆమె బట్టలు చినిగిపోయేలా అత్యంత దురుసుగా ప్రవర్తించినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

హుబ్బళ్లి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని హుబ్బళ్లి లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఓ పార్టీ మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో ఆమెపై దాడి చేయడమే కాకుండా, ఆమె బట్టలు చినిగిపోయేలా అత్యంత దురుసుగా ప్రవర్తించినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఆందోళనకర దృశ్యాలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా (స్వయంగా) స్వీకరించిన కమిషన్.. మహిళ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కి ఘాటుగా లేఖ రాసింది. వెంటనే జోక్యం చేసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కోరింది.

ఈ ఘటనపై తక్షణమే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని, వీడియో సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించి నిష్పక్షపాతంగా, నిర్ణీత గడువులోగా విచారణ జరపాలని ఎన్‌సీడబ్ల్యూ ఆదేశించింది. విచారణలో పోలీసుల దుష్ప్రవర్తన నిజమని తేలితే, బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా, బాధితురాలికి అవసరమైన వైద్య సహాయం, మానసిక ధైర్యం కల్పించడంతో పాటు చట్టప్రకారం నష్టపరిహారం అందేలా చూడాలని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై తీసుకున్న చర్యల వివరాలతో కూడిన నివేదికను (Action Taken Report) 5 రోజుల్లోగా తమకు సమర్పించాలని డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.

Next Story