నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీ రైతులకు అంకితం: మంత్రి తుమ్మల

by Malleboina Mahesh |

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ఉధృతం చేయనున్న ప్రభుత్వం! ఏటా 2 లక్షల ఎకరాల సాగు లక్ష్యంతో ఎకరానికి రూ. 50,921 సబ్సిడీ. త్వరలోనే మరో 6 ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తుమ్మల వెల్లడి.

నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీ రైతులకు అంకితం: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇప్పటి నుండి ఆయిల్ పామ్ విప్లవం మొదలు కావాలని, రైతులను అధిక ఆదాయ వనరులు అందించే పంట కేవలం ఆయిల్ పామ్ మాత్రమే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ తెలంగాణను దేశంలోనే ఆయిల్ పామ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును విస్తరించి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధికి దీర్ఘకాలిక భరోసా ఇచ్చే పంటగా ఆయిల్ పామ్ నిలుస్తోందని, ఒకసారి నాటితే 25 నుంచి 30 సంవత్సరాలపాటు నిరంతర ఆదాయం అందించే ఈ పంట తెలంగాణ రైతులకు బంగారు భవిష్యత్తును అందించగలదన్నారు.

మా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో 1.09 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగులోకి తీసుకొచ్చామని, సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.50,921 వరకు సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 2.91 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగులో ఉండగా దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపే లక్ష్యంతో రానున్న 3 ఏండ్లలో సంవత్సరానికి 2 లక్షల ఎకరాల చొప్పున ఆయిల్ పామ్ సాగులోనికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో భాగంగా నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం మొదటి సంతకం చేసినట్టు తెలిపారు. కేవలం 16 నెలల సమయంలోనే ఈ ఫ్యాక్టరీ రైతులకు తీసుకు రావడం ఆనందంగా ఉందన్నారు.

గంటకు 30 నుండి 120 టన్నుల వరకు ఆయిల్ పామ్ గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీని అత్యాధునిక మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్టు వివరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు గూడం, కొణిజెర్ల, గద్వాల జిల్లా బీచుపల్లి, ములుగు జిల్లా ఇంచర్ల, పెద్దపల్లి జిల్లా పెద్దరాత్ పల్లి, వనపర్తి జిల్లాలోని సంకిరెడ్డిపల్లిలో 6 ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయని, వీటిని కూడా సంవత్సరంలోగా అందుబాటులోకి తెచ్చి ఆయిల్ పామ్ రైతులకు అంకింత చేస్తామని అన్నారు.

రైతులకు పంట మార్పిడి అవసరం

ప్రస్తుతం పంట మార్పిడి అవసరం ఏర్పడిందని రైతులు వరి పంటపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సన్నాలకు ఇచ్చే బోనస్ కారణంగా దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పరిమితులు విధిస్తున్న నేపథ్యంలో రైతులు వరి మాత్రమే కాకుండా ఉద్యానపంటలు, కూరగాయలు, పామాయిల్ వంటి వాణిజ్య పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులకు అధిక ఆదాయం పొందే ప్రత్యామ్నాయ పంటగా పామాయిల్ పంట ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా కోకో, జాజికాయ, మెకడామియా వంటి పంటలను కూడా సాగు చేసుకోవచ్చని తెలిపారు.

భారతదేశంలో వంట నూనెలకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం సుమారు 164 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి అవుతున్నాయన్నారు. అందులో దాదాపు 59 శాతం పామాయిల్ వాటానే అని పేర్కొన్నారు. గత ఏడాది మాత్రమే దేశం లక్షా 38 వేల కోట్ల రూపాయల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని, ఇందులో పెద్ద భాగం పామాయిల్‌దేనని చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దేశం స్వయం సమృద్ధి సాధించాలంటే ఆయిల్ పామ్ సాగును విస్తరించడం అత్యవసరమని పేర్కొన్నారు. పామాయిల్ సాగు ద్వారా రైతుల జీవితాల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణతో రైతుల ఆదాయం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.

Next Story