రైతు ఉత్సవాలకు నర్మెట్ట కర్మాగారం ముస్తాబు

by Malleboina Mahesh |

నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం. రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్. 150 స్టాల్స్‌తో భారీ రైతు ఉత్సవం!

రైతు ఉత్సవాలకు నర్మెట్ట కర్మాగారం ముస్తాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సిగలో మరో మణిహారం గా నిలిచే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే రైతు ఉత్సవాల కోసం కర్మాగార ప్రాంతం ముస్తాబు అవుతోంది. ఉగాది పండగ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రదర్శన శాలలను ప్రారంభిస్తామని, ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా ప్రజా ప్రతినిధులందరికీ ఆహ్వానాలు అందజేసినట్టు తెలిపారు. బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతు మహోత్సవంలో వ్యవసాయం, పశుసంవర్ధక అనుబంధ రంగాలకు సంబంధించిన 150 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి.

వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖల విభాగాలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు, ఎఫ్.పి.ఓలు, స్టార్టప్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు తమ ఆధునిక సాంకేతికతలు, సేవలు, అవకాశాలను రైతులకు పరిచయం చేయనున్నాయి. స్టార్టప్‌లు, ప్రైవేట్ కంపెనీల నిపుణులు, శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా ముఖాముఖి చర్చించే ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతు ఉత్సవం ఈ నెల 22 వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ శాస్త్రవేత్తలు, అనుబంధ శాఖల అధికారులు, అవార్డు గ్రహీతలు, అభ్యుదయ రైతులతో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ముఖ్యమంత్రి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి రైతన్నలకు అంకితం చేయనున్నారు.

అదే రోజున ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ దగ్గర రూ. 80 కోట్లతో నిర్మించే రిఫైనరీ యూనిట్ కి శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ వేదిక నుండే రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రైతులకు మైలురాయిగా నిలవనుంది. దీని ద్వారా ఆయిల్ పామ్ రైతుల సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గి, రైతుల ఆదాయం పెరుగుటకు దోహదపడనుంది. కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి మద్ధతు లేకపోయిన గత ఖరీఫ్ లో మొక్కజొన్న కొనుగోళ్లు చేసినట్లు, ఈ యాసంగి కూడా ప్రభుత్వం కొనుగోళ్లు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఉగాది పర్వదినం శుభాకాంక్షలు

పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి ఇంటా సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ కొత్త ఆరంభాలకు ప్రతీక అని, ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని కోరుకున్నారు. రైతులు సుభిక్షంగా ఉండటం రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

రైతులకు ఆధునిక సాంకేతికత, నీటి వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని వివరించారు. పంటల ఉత్పాదకత పెంపుతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కొత్త సంవత్సరంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story