డీసీసీబీకి నాబార్డ్ ఉత్తమ పనితీరు అవార్డు

by Ratna Kumari |

నాబార్డ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సహకార బ్యాంకుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్‌డీసీసీబీ) ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకుంది.

డీసీసీబీకి నాబార్డ్ ఉత్తమ పనితీరు అవార్డు
X

దిశ, నిజామాబాద్ అర్బన్ : నాబార్డ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సహకార బ్యాంకుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్‌డీసీసీబీ) ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకుంది. హైదరాబాద్‌లోని నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన నాబార్డ్ 45వ జాతీయ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సహకార బ్యాంకుల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ఎంపిక చేశారు.

తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్, ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ నీలేష్ ద్వివేది చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) నాగభూషణం వందే, ఉప జనరల్ మేనేజర్ లింబాద్రి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు సాధించిన పురోగతి, రైతులు, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, సహకార రంగ అభివృద్ధికి అందిస్తున్న సేవలను పలువురు వక్తలు అభినందించారు. ఈ అవార్డు బ్యాంకు పాలకవర్గం, యాజమాన్యం, ఉద్యోగుల సమిష్టి కృషికి గుర్తింపుగా లభించిందని సీఈఓ నాగభూషణం వందే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధికారులు, నాబార్డ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story