రాహుల్ మృతిపై వీడని మిస్టరీ.. న్యాయం కోసం కోరుట్లలో భారీ ధర్నా

by Jakkula.Mamatha |

హైదరాబాద్‌లో బీటెక్ చదువుతూ అదృశ్యమై, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలోని ఒక వ్యవసాయ బావిలో నెల రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ మృతిపై నిరసనలు మిన్నంటాయి.

రాహుల్ మృతిపై వీడని మిస్టరీ.. న్యాయం కోసం కోరుట్లలో భారీ ధర్నా
X

దిశ, ​కోరుట్ల రూరల్: హైదరాబాద్‌లో బీటెక్ చదువుతూ అదృశ్యమై, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలోని ఒక వ్యవసాయ బావిలో నెల రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ మృతిపై నిరసనలు మిన్నంటాయి. రాహుల్ మరణించి నెల రోజులు గడుస్తున్నా కేసు విచారణలో పురోగతి లేకపోవడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కోరుట్లలో అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ, కోరుట్ల పద్మశాలి సంఘాల నాయకులు, గ్రామస్తులు భారీ ఆందోళన చేపట్టారు. ​బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని కొండ లక్ష్మణ బాపూజీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ​

డీఎన్ఏ పరీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారని, ప్రకాశం జిల్లాలో లభ్యమైన మృతదేహం రాహుల్‌దేనని ప్రాథమిక ఆధారాల ద్వారా తెలిసినప్పటికీ, చట్టపరంగా బాడీని అప్పగించడానికి పోలీసులు డీఎన్ఏ పరీక్షల నివేదిక తప్పనిసరని చెబుతున్నారు. ఈ డీఎన్ఏ ప్రక్రియ పూర్తి కావడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, నెల రోజులుగా కన్నవారు తమ బిడ్డ అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేక పుత్రశోకంతో అల్లాడిపోతున్నారని, ఉన్నోడికో న్యాయం లేని వాడుకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాలయాపనను నిరసిస్తూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ..

ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడనే నెపంతో కొందరు స్నేహితులు రాహుల్‌ను బెదిరించారని, ఇది ఆత్మహత్య కాదని.. తమ కుమారుడిని ప్రణాళికాబద్ధంగా చంపి బావిలో పడేశారని రాహుల్ తల్లిదండ్రులు ఆరోపించారు. వాట్సప్ చాటింగ్‌లను, ఇతర ఆధారాలను పరిశీలించి సమగ్రంగా దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు. డీఎన్ఏ పరీక్షల నివేదికను వెంటనే తెప్పించి, రాహుల్ మృతదేహాన్ని గౌరవప్రదంగా కుటుంబ సభ్యులకు అప్పగించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితులు ఎంతటి వారైనా సరే తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, పుత్రశోకంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రాహుల్ తల్లిదండ్రులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, ఆర్థిక, నైతిక అండను అందించాలని వారు డిమాండ్ చేశారు.

బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా, రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను శాంతింప చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్ కుటుంబానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

Next Story