నలుగురి హత్య కేసులో వీడిన మిస్టరీ

by Ratna Kumari |

అడిగినంతన డబ్బు అప్పు ఇవ్వకపోవడంతోనే కక్ష్య పెంచుకుని ఓ కుటుంబాన్ని విచక్షణారహితంగా నరికి చంపేశారు.

నలుగురి హత్య కేసులో వీడిన మిస్టరీ
X

దిశ, నల్లగొండ క్రైం : అడిగినంతన డబ్బు అప్పు ఇవ్వకపోవడంతోనే కక్ష్య పెంచుకుని ఓ కుటుంబాన్ని విచక్షణారహితంగా నరికి చంపేశారు. ఈ హత్యల కేసు ఛేదించడానికి నల్లగొండ జిల్లా పోలీసులు నిర్విరామంగా శ్రమించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్లగొండ డీపీవోలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెళ్లడించారు. నల్గొండ పట్టణంలోని తెలంగాణ కాలనీ సాగర్ రోడ్డులో ఈ నెల 22న సాయంత్రం 06:00 గంటల సమయంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఇంట్లోనే చనిపోయి, మృతదేహాలు కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్, సీనియర్ అధికారుల ఆదేశానుసారం తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేసి పారిపోయారా అనే కోణంలో దర్యాప్తు చేయడానికి డీఎస్పీ కే.శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, సీసీఎస్, సిబ్బందితో కలిపి మొత్తం ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు చుట్టుపక్కల వారిని విచారించి, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కీలక సాక్ష్యాలను సేకరించాయి. నిందితులకోసం గాలిస్తుండగా, శుక్రవారం నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకుచ్చి విచారించగా నేరం అంగీకరించారు.

అప్పు ఇవ్వకపోవడంతో కక్ష్య..

నల్లగొండలోని సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో మహమ్మద్ సుల్తాన్ (45), ఇతని రెండో భార్య హసీనా(40), సుల్తాన్ మొదటి భార్య కుమారుడు ముజమ్మిల్ (20), కుమార్తె అక్సూరా (11) సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో నివసిస్తున్నారు. సుల్తాన్ ఓ బ్యాగులు దుఖాణంలో పనిచేస్తుండగా, హసీనా ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పని చేస్తుండేది. ముజమ్మిల్ ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తుండగా, కుమార్తె చదువుకుంటోంది. ఈ క్రమంలో సయ్యద్ అస్లాం అనే వ్యక్తి కార్ డ్రైవర్‌గా పని చేస్తూ, తన భార్య తబస్సుంతో కలిసి హైదరాబాద్ గండిపేటలో నివాసం ఉంటున్నాడు. అస్లాం కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడి విపరీతంగా అప్పులు చేయడంతో భార్యాభర్తలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ క్రమంలో తబస్సుం తల్లి తహేరా బేగం సొంత చెల్లెలు అయిన హసీనా దగ్గర ఏడాది క్రితం అస్లాం రూ.1లక్ష అప్పుగా తీసుకుని వడ్డీ చెల్లిస్తున్నాడు. ఇటీవల అస్లాం భార్య గర్భవతి కావడంతో పాటు, కొత్త కారు కొనుగోలు చేయడానికి మరో రూ.లక్ష అప్పు ఇవ్వాలని హసీనాను అడిగాడు. దానికి ఆమె నిరాకరిస్తూ.. "పాత అప్పుకే వడ్డీ సరిగా కట్టడం లేదు, నీకెందుకు ఇవ్వాలి?" అని అవమానకరంగా మాట్లాడటమే కాకుండా, ఇచ్చిన పాత బాకీని కూడా వెంటనే తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసింది. దీనిపై అస్లాం, తబస్సుంలు హసీనా కూతురైన బుష్రాను సంప్రదించగా, ఆమె కూడా తన తల్లి (హసీనా) తనకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయడం లేదని, మొత్తం సుల్తాన్ పిల్లలైన ముజమ్మిల్, అఫ్కూరాలకే పెడుతోందని, ఇంట్లో చాలా డబ్బు, బంగారం ఉన్నాయని సమాచారం ఇచ్చింది. మరోవైపు, 2013 లో హసీనా మొదటి భర్త సుజాత్ పెట్టిన కేసులో తబస్సుం తల్లి తహేరా బేగం జైలుకు వెళ్లడానికి హసీనానే కారణమనే పాత కక్ష కూడా ఉంది. తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మానవత్వంతో సహాయం చేయడం లేదనే కోపంతో, ఎలాగైనా హసీనా ఇంట్లో దొంగతనం చేయమని తబస్సుం తన భర్త అస్లాంకు సూచించింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 28న అస్లాం, అతని స్నేహితుడు సోహైల్ (A-3) కలిసి మధ్యాహ్నం సమయంలో హసీనా ఇంట్లో ఎవరూ లేనిది చూసి, తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే అక్కడ ఎలాంటి డబ్బు, వస్తువులు దొరకకపోవడంతో, కోపంతో అస్లాం గోడలకు కోడిగుడ్లు పగులగొట్టి పారిపోయాడు.

చంపితేనే డబ్బు వస్తుందనే అత్యాశతో జైలుకు..

ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువ కావడంతో, హసీనా కొత్త ఇల్లు కొనడానికి బ్యాంకులో రూ. 2,25,000/- ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిందని, ఇంట్లో 10 తులాల బంగారం, నగదు ఉన్నాయని అస్లాం దంపతులు తెలుసుకున్నారు. హసీనా ఎప్పుడూ తన ఒంటిపైనే ( దుస్తుల్లో) బంగారం దాచుకుంటుందని, ఆమెను చంపితేనే బంగారం దొరుకుతుందని పథకం వేశారు. ఇందుకోసం అస్లాం యూట్యూబ్‌ లో "హత్య చేసి దొరకకుండా ఉండటం ఎలా?", "హత్య చేసిన తర్వాత శవాలు ఎన్ని రోజులకు కుళ్లిపోతాయి?", "పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి?" వంటి వీడియోలు చూసి పక్కా స్కెచ్ వేశాడు. ప్రణాళిక ప్రకారం, ఈ నెల 19వ తేదీ సాయంత్రం 07:00 గంటలకు గండిపేట నుంచి తన మహీంద్రా మరాజో కారులో, వెంట ఒక జమ్మి కత్తిని తీసుకుని నల్గొండకు చేరుకున్నాడు. రాత్రి సుల్తాన్ ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి, కిరాయి పని మీద నల్గొండకు వచ్చానని, రాత్రి 11:00 గంటలకు ఇంటికి వస్తానని చెప్పాడు. కానీ వారు సరిగా స్పందించకపోవడంతో పాటు ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో మరింత కక్ష పెంచుకున్న అస్లాం, సాగర్ రోడ్డు అవుట్ స్కర్ట్స్‌లో వేచి చూసి, అర్ధరాత్రి సుమారు 02:00 గంటల సమయంలో కాంపౌండ్ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి నక్కి ఉన్నాడు. తెల్లవారుజామున సుమారు 05:00 గంటల సమయంలో హసీనా ఇంటి తలుపు తీసుకుని బయటకు రాగానే, గుమ్మం దగ్గర దాక్కున్న అస్లాం ఒక్కసారిగా ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు వేస్తూ రక్తపు మడుగులో పడిపోయింది. ఆ కేకలు విని బయటకు వచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నించిన సుల్తాన్‌ను పట్టుకుని అతని మెడపై కూడా కత్తితో దాడి చేశాడు. అనంతరం నిద్ర లేచి భయంతో పారిపోతున్న ముజమ్మిల్‌పై దాడి చేయగా, ముజమ్మిల్ తన వద్ద ఉన్న ఐరన్ రాడ్‌ (షీకు)తో ప్రతిదాడి చేశాడు. ఈ పెనుగులాటలో అస్లాం ఎడమచేతి చూపుడు వేలికి రక్తగాయమైంది. రెండు కాలి పాదాలకు గాయాలయ్యాయి. అయినప్పటికీ అస్లాం ముజమ్మిల్‌ను నరికి చంపాడు.ఆ సమయంలో బెడ్‌రూమ్‌లో ఉన్న సుల్తాన్ చిన్న కుమార్తె అఫ్కూరా భయంతో మంచం కింద దాక్కుంది. ఆమె తనను చూసిందని, బయటకు చెబితే తను దొరికిపోతానని భావించిన అస్లాం, సాక్ష్యం లేకుండా చేయడం కోసం అఫ్కూరాను మంచం కింద నుంచి బయటకు లాగి, మెడపై కత్తితో బలంగా పొడిచి చంపేశాడు.

బీరువాలో డబ్బు, బంగారం ఎత్తుకెళ్లి..

నలుగురూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత, బీరువాలోని 5 తులాల బంగారు ఆభరణాలు, ల్యాండ్, బ్యాంక్ పత్రాలను దొంగిలించాడు. బయట పడి ఉన్న ముగ్గురి మృతదేహాలను ఎవరూ చూడకుండా ఉండేందుకు వాటిపై చద్దర్లు, చాపలు కప్పి, ఇంటి గేటుకు తాళం వేసి తన కారులో హైదరాబాద్ పారిపోయాడు. ఈ నెల 22న తన స్నేహితుడైన సోహెల్ సహాయంతో ఆ బంగారు ఆభరణాలను దిల్ సుక్ నగర్‌లోని బాలాజీ జ్యువెలర్స్ యజమాని హేమంత్ కుమార్ (A-4) వద్ద తాకట్టు పెట్టాడు. అందుకు ప్రతిఫలంగా రూ. 5.30లక్షలు తీసుకుని పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. నిందితులైన సయ్యద్ అస్లాం, తబస్సుం మహమ్మద్ సోహైల్, హేమంత్ కుమార్ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. నిందితుల నుంచి కారు, రూ. 3,004,000 నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి (జమ్మి), మూడు సెల్ ఫోన్లు, ఐదు తులాల కరిగించిన బంగారు ముద్ద, ల్యాండ్, బ్యాంక్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కేవలం 3రోజుల్లోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను పట్టుకున్న నల్గొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి, వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రూరల్ ఎస్సై శివప్రసాద్, టూ టౌన్ ఎస్సై సైదాబాబు, నకిరేకల్ ఎస్సై వీరబాబు, సీసీఎస్ బృందం సభ్యులైన విష్ణు వర్ధనగిరి, నాగార్జున ప్రసాద్, పుష్పగిరి, వైదుపాషా, సాయి శివరాజ్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించి రివార్డులను ప్రకటించారు.

Next Story