కొడుకులు ఇంట్లోకి రానివ్వడం లేదు.. భూమి మొత్తం వారి పేరుతో పట్టా చేయించుకున్నారు

by Batti.Sumithra |

తన పేరుతో ఉన్న భూమి మొత్తాన్ని కుమారుల పేరుతో పట్టా చేయించుకున్నారు.

కొడుకులు ఇంట్లోకి రానివ్వడం లేదు.. భూమి మొత్తం వారి పేరుతో పట్టా చేయించుకున్నారు
X

దిశ, లోకేశ్వరం: తన పేరుతో ఉన్న భూమి మొత్తాన్ని కుమారుల పేరుతో పట్టా చేయించుకున్నారు. వాకిట్లో నాలుగు రేకులు వేసి అందులో నివాసం కల్పించినా, అందులోకి సైతం రావద్దంటూ కొడుకులు, కోడళ్లు వేధింపులకు గురి చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. లోకేశ్వరం మండలంలో కలెక్టర్ పర్యటన సందర్భంగా రైతు వేదిక వద్ద మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన జంగం గంగుబాయి తన గోడును కలెక్టర్‌కు వివరించారు.

తన పేరుతో ఒకటిన్నర ఎకరాల భూమి ఉందని, తనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని తెలిపారు. కుమార్తె ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో అర ఎకరం భూమిని ఆమె పేరుతో పట్టా చేయించి ఇచ్చానని చెప్పారు. దీంతో కుమారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మిగిలిన ఒక ఎకరం భూమిని కూడా తమ పేర్లపై పట్టా చేయాలని ఒత్తిడి చేయడంతో, ఇద్దరికీ సమానంగా అర ఎకరం చొప్పున పట్టా చేసి ఇచ్చానని తెలిపారు. ప్రస్తుతం తన బాగోగులు కూడా చూడకుండా, ఇంట్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని పిలిపించి మాట్లాడి తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. దీని పై స్పందించిన కలెక్టర్, వెంటనే విచారణ జరిపి వృద్ధురాలి సమస్యకు పరిష్కారం చూపాలని తహసీల్దార్ సూర్యారావును ఆదేశించారు.

Next Story