జిల్లా పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొరడా..

by Taduka Kalyani |

సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ కస్టడీ మరణం ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

జిల్లా పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొరడా..
X

దిశ, సూర్యాపేట; సూర్యాపేట జిల్లా కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ కస్టడీ మరణం ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై తెలంగాణ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించడంతో కమిషన్ కేసును విచారణకు స్వీకరించి తెలంగాణ పోలీసు శాఖపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల ప్రకారం... కార్ల రాజేష్‌ను పోలీసులు ఐదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురిచేశారని, అనంతరం ఆయన మృతి చెందారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఒప్పుకొమ్మని పోలీసులు ఒత్తిడి తెచ్చారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారిక విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూర్యాపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసి, మూడు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కేసు నమోదు పరిస్థితి, పోస్ట్‌మార్టం నివేదిక, పోస్ట్‌మార్టం వీడియో రికార్డింగ్, మేజిస్ట్రియల్ విచారణ పురోగతి, వైద్య పత్రాలు, ఇతర సంబంధిత రికార్డులను కమిషన్‌కు అందించాలని సూచించింది.

బాధితుడి తల్లి చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, కస్టడీ మరణంపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించిందా, ఎలాంటి చర్యలు తీసుకుందనే వివరాలను సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరింది. కస్టడీ మరణం వెనుక వాస్తవ పరిస్థితులు ఏమిటి, పోలీసుల పాత్రపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు ఏమిటి, అనే అంశాలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఈ కేసులో సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది.కస్టడీ మరణం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ అనంతరం వెలువడే నివేదికపై బాధిత కుటుంబంతో పాటు ప్రజలు, మానవ హక్కుల సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Next Story