పోలీస్ వాహనంపై 71 కేసులు.. అవాక్కైన అధికారులు

by Muthe.Rajitha |

పౌరులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడాల్సిన పోలీసులే ట్రాఫిక్ నియమాలను బేఖాతరు చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీస్ వాహనంపై 71 కేసులు.. అవాక్కైన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్ : పౌరులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడాల్సిన పోలీసులే ట్రాఫిక్ నియమాలను బేఖాతరు చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలో అటుగా వెళ్తున్న ఒక పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గమనించిన ఓ అడ్వొకేట్, దానిపై ఏమైనా చలానాలు ఉన్నాయా అని వాహనం నెంబర్ సహాయంతో ఆన్‌లైన్‌లో తనిఖీ చేశారు. దాదాపు రెండేళ్ల కాలంలో ఆ వాహనంపై ఏకంగా 71 సార్లు చలానాలు నమోదై, రూ.36,500 ఫైన్ పెండింగులో ఉండటాన్ని చూసి ఆయన అవాక్కయ్యారు. ఇందులో సిబ్బంది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే అత్యధికంగా ఉన్నట్లు గుర్తించిన సదరు న్యాయవాది, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆధారాలతో సహా ఈ వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం కాస్తా నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయింది.

ఈ ఉదంతంపై నెటిజన్లు, స్థానిక ప్రజలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై దుమ్మెత్తి పోశారు. దాంతో ఈ నిర్లక్ష్య వ్యవహారం కాస్తా ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో సదరు పోలీస్ బాసులు తక్షణమే స్పందించారు. చట్టం మరియు ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎవరికైనా ఒక్కటేనని స్పష్టం చేసిన అధికారులు, ఈ నిబంధనల ఉల్లంఘనకు సదరు వాహన డ్రైవరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సదరు సిబ్బందిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు. అయినప్పటికీ, రక్షణ కల్పించాల్సిన వారే ఇలా చట్టాన్ని అతిక్రమించడంపై ప్రజల నుండి ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి.

Next Story