ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ రూ.10 కోట్ల మోసం.. పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్న బాధితులు

by Muthe.Rajitha |

KPHB 'ముత్తూట్ ఫైనాన్స్' మేనేజర్ కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని, వారికి తెలియకుండానే మరో ఫైనాన్స్ సంస్థలో పెట్టి కోట్ల రూపాయలు దారి మళ్లించింది.

ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ రూ.10 కోట్ల మోసం.. పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్న బాధితులు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగుచూసింది. ‘ముత్తూట్ ఫైనాన్స్’ (Muthoot Finance) బ్రాంచులో కస్టమర్లు నమ్మి తాకట్టు పెట్టిన బంగారాన్ని, వారికి తెలియకుండానే మరో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పెట్టి కోట్ల రూపాయలు దారిమళ్లించిన మేనేజర్ ప్రియాంకరెడ్డి లీలలు సంచలనం సృష్టిస్తున్నాయి. తక్కువ వడ్డీకి రుణాలిస్తానని నమ్మబలికి వారిని నట్టేట ముంచేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

తక్కువ వడ్డీ ఆశచూపి.. ఓటీపీలతో టాపప్ మోసాలు

కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో ప్రియాంకరెడ్డి మేనేజర్‌గా పనిచేస్తున్నారు. సాధారణంగా ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారంపై రూ.1.40 పైసల వడ్డీకి రుణాలు ఇస్తుండగా.. తాను కేవలం 50 పైసల వడ్డీకే రుణం ఇప్పిస్తానని నమ్మబలికి, కస్టమర్ల వడ్డీ డబ్బులను సంస్థకు కాకుండా నేరుగా తన సొంత ఖాతాకు జమ చేయించుకునేది. అంతేకాకుండా, కస్టమర్లు తీసుకున్న రుణంపై ‘టాపప్ లోన్’ ఇప్పిస్తానంటూ నమ్మించి, వారి మొబైల్ ఫోన్లకు వచ్చే ఓటీపీ (OTP)లను చెప్పించుకునేది. అలా డిజిటల్ సంతకాలు సృష్టించి టాపప్ ద్వారా మంజూరయ్యే అదనపు డబ్బును వినియోగదారులకు ఇవ్వకుండా దొంగచాటుగా తన సొంత అకౌంట్లలోకి మళ్లించుకునేది.

ఇక్కడ బంగారం మాయం.. పక్కనే సొంత ఫైనాన్స్ దుకాణం!

ప్రియాంకరెడ్డి మోసాలు ఇంతటితో ఆగలేదు. తనతో పాటు ముత్తూట్ ఫైనాన్స్‌లో పనిచేసే కొందరు సిబ్బందిని చేరదీసి, ఆ బ్రాంచ్‌కు పక్కనే మరో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థను ప్రారంభించింది. ముత్తూట్ కస్టమర్లకు తెలియకుండానే, వారు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను లూటీ చేసి తన సొంత ఫైనాన్స్ సంస్థలో డిపాజిట్ చేసేది. ఆ బంగారాన్ని ప్రయివేట్ వ్యక్తులకు అధిక వడ్డీలకు తిప్పుతూ అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసింది.

బండారం బయటపడిందిలా!

గురువారం ఒక వృద్ధుడు తాను గతంలో తీసుకున్న గోల్డ్ లోన్ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించి, తన బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాల్సిందిగా బ్రాంచ్ సిబ్బందిని కోరారు. అయితే లోన్ క్లియర్ చేసినప్పటికీ ఆమె ఆభరణాలు ఇవ్వకుండా, కాలయాపన చేస్తూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆయనకు అనుమానం వచ్చి నిలదీశారు. ఇది గమనించిన మిగతా కస్టమర్లు కూడా అక్కడికి చేరుకుని మేనేజర్‌ను గట్టిగా ప్రశ్నించడంతో అసలు మోసం బయటపడింది. తమ బంగారం ముత్తూట్ లాకర్‌లో లేదని, తామంతా ఘోరంగా మోసపోయామని గ్రహించిన బాధితులు పెద్ద ఎత్తున కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లి ఫిర్యాదు చేశారు.

అంతర్గత విచారణకు ఆదేశం

బాధితుల ఫిర్యాదు మేరకు మేనేజర్ ప్రియాంకరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కేపీహెచ్‌బీ ఎస్‌హెచ్‌వో (SHO) తెలిపారు. ముత్తూట్ బ్రాంచ్‌లో పూర్తిస్థాయి ఆడిటింగ్ (Audit) నిర్వహిస్తే తప్ప ఎంతమంది బంగారం మాయమైంది? ఎన్ని కోట్ల రూపాయల మోసం జరిగింది? అనే పూర్తి వివరాలు అధికారికంగా తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

Next Story