- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయమూర్తికే పిటిషనర్ ఆర్డర్.. సుప్రీంకోర్టులో హైడ్రామా
సుప్రీంకోర్టులో శుక్రవారం జరిగిన ఓ కేసు విచారణ సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. పిటిషన్ వాదనలు వినిపిస్తూ కోర్టులో అనుచితంగా ప్రవర్తించాడు.

దిశ, నేషనల్ బ్యూరో : అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో శుక్రవారం తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది. విచారణకు స్వయంగా హాజరైన ఓ పిటిషనర్, న్యాయమూర్తుల ధర్మాసనం వైపు కాగితాలను విసిరేసి, అసభ్య పదజాలంతో దూషణలకు దిగాడు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను కోర్టు హాల్ నుండి బయటకు తీసుకువెళ్లారు. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఈ ఘటన జరిగింది. ప్రబల్ ప్రతాప్ అనే పిటిషనర్ వాదనలు ప్రారంభిస్తూ దూకుడుగా..‘మిస్టర్ జుడీషియల్ సర్వెంట్.. నేనే సార్వభౌమాధికారిని. సైబర్ నేరాల సిండికేట్ నడుపుతున్న లక్నో ఏసీపీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను’ వ్యాఖ్యానించాడు. పిటిషనర్ ప్రవర్తనకు షాకైన జస్టిస్ విశ్వనాథన్.. ‘‘నువ్వు మమ్మల్ని ఆదేశిస్తున్నావా?’’ అని ప్రశ్నించారు. దానికి పిటిషనర్ స్పందిస్తూ.. ‘నా వైపు నుండి చెప్పాల్సింది ఇంతే. అంతా రికార్డుల్లో ఉంది’ అంటూ ఆగ్రహంతో.. కేసు పేపర్లను గాల్లోకి విసిరేసి, కోర్టును దూషించాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది ఆయనను బయటకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ను ఉద్దేశిస్తూ.. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ దూషించాడు. ‘ఈ పేపర్లు తీసుకుపోయి మీ సీజేఐకి ఇవ్వండి’ అంటూ దుర్బాషలాడాడు.
ధర్మాసనం దయాగుణం
సాధారణంగా ఇలాంటి ప్రవర్తనకు పాల్పడిడే కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశిస్తారు. అయితే ఈ కేసులో ధర్మాసనం ఎంతో సంయమనంతో, దయాగుణంతో వ్యవహరించింది. పిటిషనర్ ప్రబల్ ప్రతాప్‌పై ఎలాంటి చట్టపరమైన, ధిక్కార చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు నిర్ణయించింది. విచారణ ప్రారంభమైనప్పుడు పిటిషనర్ కేసును వాదించకుండా, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని కోర్టు పేర్కొంది. అయినప్పటికీ, పిటిషనర్ మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు గమనించి, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని తాము భావించడం లేదని ధర్మాసనం ఉదారంగా వ్యాఖ్యానించింది. కాగా.. ఇక కేసు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించామని, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి సరైన కారణాలు కనిపించడం లేదని పేర్కొంటూ సదరు పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.






