- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూసీ నది పునరుజ్జీవనం ప్రణాళికలో శాస్త్రీయత లేదు : వెదిరె శ్రీరామ్
ప్రజాభిప్రాయం తరువాతే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలని కేంద్ర జల వనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మూసీ నది పునరుజ్జీవనం పేరుతో రేవంత్ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికల్లో ఎక్కడ శాస్త్రీయ దృష్టికోణం కనిపించడం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు, కేంద్ర జల వనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ పేర్కొన్నారు. రివర్ రిజువినేషన్ అంటే నదిని ఒక జీవ వ్యవస్థగా పునరుద్ధరించడం కాగా, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే కేవలం సుందరీకరణ మాత్రమేనని చెప్పారు. ఆదివారం మూసీ నది పునరుజ్జీవనం - వాస్తవాలు అంశంపై బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని మూసీ నది పునరుద్ధరణపై సాంకేతిక విశ్లేషణ చేస్తూ కీలక ప్రసంగం చేశారు. జీవం లేని నదిపై కేవలం అలంకరణ చేయడంతో ప్రయోజనం ఉండదని, ముందుగా నది ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం అత్యవసరమని స్పష్టం చేశారు. నదిలో చేపలు జీవించగలగడం, నీటి నాణ్యత మెరుగుపడడం వంటి సూచికల ద్వారా మాత్రమే పునరుజ్జీవనం సాధ్యమవుతుందని తెలిపారు. నది అంటే కేవలం పైన ప్రవహించే నీరు మాత్రమే కాదు, భూమి కింద ఉన్న పాలియో ఛానల్స్, భూగర్భ జలాలు, సెడిమెంట్ ప్రవాహం, సీజనల్ మార్పులు, రైపేరియన్ జోన్ వంటి అంశాల సమగ్ర వ్యవస్థ అన్నారు. నీరు-భూమి కలిసే ప్రాంతమైన రైపేరియన్ జోన్ నది ఆరోగ్యానికి అత్యంత కీలకమని, అక్కడ ఫిల్ట్రేషన్, జీవవైవిధ్యం, హ్యాబిటాట్ సపోర్ట్ జరుగుతుందని చెప్పారు. ఈ సహజ వ్యవస్థలను విస్మరించి కాంక్రీట్ నిర్మాణాలపై మాత్రమే దృష్టి పెట్టడం నది జీవ వ్యవస్థకు హానికరమని హెచ్చరించారు.
ఈ ప్రాంతంలో క్యాచ్‌మెంట్ ఏరియా ట్రీట్మెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని, చిన్న వాగులు, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ పునరుద్ధరించకుండా ప్రధాన నది పునరుజ్జీవనం అసాధ్యమని పేర్కొన్నారు. రిడ్జ్ టు వ్యాలీ విధానంలో చెక్ డ్యామ్‌లు, కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్, పెర్కొలేషన్ ట్యాంకులు, బరాజ్‌లు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి, భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేసిన అనుభవం ఉందని తెలిపారు. నగర ప్రాంతంలో ప్రధాన సమస్య సివరేజ్ కాలుష్యమని, సివరేజ్ నీరు నదిలోకి చేరకుండా ఇంటర్సెప్టర్ వ్యవస్థలు ఏర్పాటు చేసి, కేవలం శుద్ధి చేసిన నీటినే విడుదల చేయాలన్నారు. బఫర్ జోన్ విషయంలో శాస్త్రీయ విధానం అనుసరించాలని, నది సహజ ప్రవాహ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలు మాత్రమే తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. నది బెడ్‌లో ఉన్న పరిమిత ఆక్రమణలను రీహాబిలిటేషన్ ద్వారా పరిష్కరించవచ్చన్నారు.
ప్రజల భాగస్వామ్యం కీలకం :
నది పునరుజ్జీవనం విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, నమామి గంగే, సబర్మతి వంటి ప్రాజెక్టుల్లో చేసినట్లుగా విస్తృత ప్రజాభిప్రాయం, నిపుణుల సూచనలు, వార్డు స్థాయిలో చర్చలు జరిపి, అందరి భాగస్వామ్యంతో ప్రణాళికను అమలు చేయాలి. మూసీ నది పునరుజ్జీవనం అనేది కేవలం అభివృద్ధి ప్రాజెక్ట్ కాదని ఇది ఒక సమగ్ర పర్యావరణ, సామాజిక, శాస్త్రీయ ప్రక్రియ అన్నారు. అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ప్రాజెక్ట్ అమలు చేయాలని, మూసీని ముందుగా జీవంతో నింపడం, శాస్త్రీయంగా పునరుద్ధరించడం అసలు పరిష్కారమని స్పష్టం చేశారు.






