- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హడలెత్తిస్తున్న హత్యలు..!
జోగులాంబ గద్వాల జిల్లాలో భూతగాదాలు, వ్యక్తిగత కక్షలు, అనుమానాలు, వివాహేతర సంబంధాలు హత్యలు, పరస్పర దాడులకు కారణం అవుతున్నాయి.

దిశ, గద్వాల క్రైమ్: జోగులాంబ గద్వాల జిల్లాలో భూతగాదాలు, వ్యక్తిగత కక్షలు, అనుమానాలు, వివాహేతర సంబంధాలు హత్యలు, పరస్పర దాడులకు కారణం అవుతున్నాయి. జిల్లాలో భూతగాదాలు ఎక్కువగానే ఉండడం, పలు సందర్భాల్లో దాడులకు పాల్పడితే మరి కొంతమంది పోలీస్ స్టేషన్లు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు వివాహేతర సంబంధాలు, అనుమానాలు భార్యాభర్తల బంధాలకు ఆటంకాలుగా మారుతున్నాయి. పాత కక్షలు పగలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హత్యలు, పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఇటీవల జిల్లాలో జరిగిన మూడు సంఘటనలకు ఈ అంశాలు కారణమా.. కాదా అన్న విషయాలను పక్కన పెడితే దాదాపుగా ఈ అంశాలే హత్యలకు, దాడులకు కారణమవుతున్నాయని పలువురు అంటున్నారు.
పది రోజుల్లో మూడు సంఘటనలు..
జోగులాంబ గద్వాల జిల్లాలో పది రోజుల్లో రెండు హత్యలు జరగగా.. మరో వ్యక్తి తన సొంత భార్య పై కొడవలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడడం జిల్లాలో సంచనాలను కలిగిస్తోంది. ఇటీవల వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామానికి చెందిన బోయ మహేష్ అనే యువకుడు ఈనెల 8వ తేదీన హత్యకు గురై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. హత్యకు గల కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. శుక్రవారం గద్వాల మండలం శెట్టి ఆత్మకూరులో సంధ్యా రాజు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
గతంలో ఈ వ్యక్తి ఓ మహిళను అపహరించి వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకొని ఆ మహిళ భర్తను హతమార్చి ఇటీవల విడుదలయ్యాడని సమాచారం. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ వ్యక్తిని హత్య చేయడం వెనక పాత కక్షలు కారణమై ఉండవచ్చు అని పలువురు అంటున్నారు. మల్దకల్ మండలం మల్లెం దొడ్డి గ్రామంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవల కారణంగా భర్త ఆ మహిళపై కొడవలితో దాడి చేసి విచక్షణారహితంగా నరికాడు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వెనుక భార్యాభర్తల మధ్య అనుమానాలే కారణం అని ప్రచారం జరుగుతోంది.
పోలీసుల నిఘా పెరగాలి..
జిల్లాలో వరుసగా జరుగుతున్న ఘోరాలపై పోలీసు శాఖ తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. భూములు, ఆస్తుల తగాదాలు ఉంటే రెవెన్యూ అధికారులతో కలిసి వాటిని త్వరగా పరిష్కరించేలా చొరవ చూపాలి. గ్రామీణ ప్రాంతాల్లో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు.. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడే రౌడీ మూకలపై, నేరగాళ్లపై కఠిన చట్టాలు ప్రయోగించి ఉక్కుపాదం మోపితేనే నడిగడ్డ పై నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని ప్రజలు కోరుతున్నారు.






