ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం బ్రదర్స్‌కు మున్సిపల్ ఓటర్ల ఝలక్

by Malleboina Mahesh |

మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే వినోద్‌లతో పాటు మరో 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రతికూల ఫలితాలు రావడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి మంత్రం పనిచేయలేదా? లేక స్థానిక నేతల మధ్య సమన్వయ లోపమా? పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి.

ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం బ్రదర్స్‌కు మున్సిపల్ ఓటర్ల ఝలక్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో దివంగత నేత గడ్డం వెంకటస్వామి కుమారులైన మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోద్‌లకు సొంత నియోజకవర్గం ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చారు. వివేక్ తన నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ఊహించని స్థాయిలో ఎన్నికల వనరులను ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మాత్రం ఆయనను ఆదరించలేదు.

అక్కడ బీఆర్ఎస్, సీపీఐ కలిసి పోటీ చేయగా బీఆర్ఎస్ 10, సీపీఐ 4 స్థానాల్లో గెలిచి చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను కైవసం చేసుకోనున్నాయి. కాంగ్రెస్ కేవలం 7 స్థానాలు గెలవగా, ఒకచోట ఇండిపెండింట్ గెలిచారు. అలాగే వివేక్ సోదరుడు, ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గం బెల్లంపల్లిలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 14, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 5 చోట్ల విజయం సాధించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

హైకమాండ్‌కు ఫిర్యాదు చేసే చాన్స్..

మంత్రులు అందరూ తమ సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో విజయం సాధించగా వివేక్ నియోజకవర్గంలోని ఒక మున్సిపాలిటీలో ఓడిపోవడంపై ఆయన వ్యతిరేకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి వల్లే నియోజకవర్గంలో వ్యతిరేక తీర్పు వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, కొంతమంది లీడర్లను మాత్రమే ఎంకరేజ్ చేయడంతో ఈ ఫలితాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు.

మరోవైపు వివేక్‌కు మెదక్ పార్లమెంట్ లోకసభ సెగ్మెంట్ ఇంచార్జి బాధ్యతలు అప్పగించగా, ఆయన అక్కడ కూడా పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో మెజార్టీ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందన్న చర్చ సాగుతోంది. దీంతో వివేక్‌ను బాధ్యుడిగా చేసి, చర్యలు తీసుకోవాలని ఆయన వ్యతిరేక టీమ్ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

12 మంది ఎమ్మెల్యేలు సైతం..

కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను గెలుచుకోలేకపోయారు. పాలకుర్తి నియోజకవర్గం (యశస్విని‌రెడ్డి) తొర్రూరులో కాంగ్రెస్ ఓటమి పాలైంది. తుంగతుర్తి(మందుల సామేల్)లోని తిరుమలగిరి, కల్వకుర్తి నియోజకవర్గం(కసిరెడ్డి నారాయణ‌రెడ్డి)ఆమన్‌గల్‌లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మెదక్ మున్సిపాలిటీ(మైనంపల్లి రోహిత్)లో హంగ్ ఫలితాలు వచ్చాయి. అలాగే మరో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. అందులో వేములవాడ(ఆది శ్రీనివాస్), కేసముద్రం (మురళీ నాయక్- మహబూబాబాద్) దేవరకొండ (బాలునాయక్), దేవరకద్ర (మదుసూదన్‌రెడ్డి), పరిగి(రామ్మోహన్‌రెడ్డి), వర్ధన్నపేట(నాగరాజు), బెల్లంపల్లి (వినోద్) మున్సిపాలిటీలు ఉన్నాయి.

Next Story