- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ రెండు రాత్రుల్లో తారుమారు కానున్న మున్సిపల్ ఫలితాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. వారం రోజులుగా కొనసాగిన మైకుల హోరు, పార్టీల జెండాల రెపరెపలకు అధికారికంగా తెరపడింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులకు అత్యంత కీలకమైన 'రెండు రాత్రుల' అగ్నిపరీక్ష మొదలైంది. సోమవారం సాయంత్రం మైకుల హోరు తగ్గగానే తెరవెనుక ప్రలోభాల పర్వానికి తెర లేచింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు లక్షలాది రూపాయల నగదు, మద్యాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి. భీమ్‌గల్‌లో ఒక్కో ఓటుకు రూ. 5 వేల వరకు పలికే స్థాయికి పోటీ పెరగడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు రాత్రుల్లో పంపిణీ సజావుగా సాగితేనే తమకు ఓట్లు పడతాయని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని అభ్యర్థులకు నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయి.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. వారం రోజులుగా కొనసాగిన మైకుల హోరు, పార్టీల జెండాల రెపరెపలకు అధికారికంగా తెరపడింది. అయితే, ప్రచారం ముగిసిన వెంటనే తెర వెనుక 'ప్రలోభాల పర్వం' మొదలైంది. సోమవారం, మంగళవారం రాత్రులు అభ్యర్థులకు అత్యంత కీలకంగా మారాయి. ఈ 48 గంటల్లో ఓటర్లను ఎవరెలా ప్రసన్నం చేసుకుంటారనే దానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని అభ్యర్థులు భావిస్తున్నారు.
గెలుపు కోసం ‘నోట్ల’ రాజకీయం
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఓటర్లకు నోట్లు పంచాల్సిందేననే బలమైన నమ్మకంతో అభ్యర్థులు ఉన్నారు. ఇందుకోసం అభ్యర్థులు లక్షలాది రూపాయలు సమకూర్చుకుని సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అప్పులు చేసి, ఆస్తులు అమ్మి మరీ దండిగా డబ్బుల సంచులు నింపుకున్నారు. ప్రచార సమయం ముగియడంతో ఇక నమ్మకస్తులైన అనుచరుల ద్వారా గల్లీల్లో నగదు, మద్యం పంపిణీ కి రంగం సిద్ధం చేశారు. పంపిణీ సక్రమంగా జరిగితేనే ఓట్లు రాలుతాయని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిష్టాత్మక పోరు..
నిజామాబాద్ కార్పొరేషన్ పీఠంపై జెండా ఎగరవేయడానికి కాంగ్రెస్, బీజేపీ శక్తులు ఒడ్డుతున్నాయి. బీజేపీ గెలుపును అడ్డుకోవడానికి కాంగ్రెస్, ఎంఐఎం మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందనే చర్చ నగరంలో జోరుగా సాగుతోంది. ఎంఐఎం సహకారం తీసుకుని ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రస్థాయిలో ఉత్కంఠ రేపుతున్న నిజామాబాద్ ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భీమ్‌గల్‌లో హోరాహోరీ..
బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి చావో రేవో సమస్యగా మారింది. ఆయనను నిలువరించడానికి టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ పోటీ తీవ్రస్థాయికి చేరడంతో ఒక్కో ఓటుకు రూ. 5 వేల వరకు ఆఫర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తమను ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా, బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు ఎవరి జాతకాన్ని మారుస్తారో తెలియక అభ్యర్థులకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి.






