Municipal Elections: ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కేటీఆర్

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

Municipal Elections: ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని సూచించారు. మంగళవారం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మున్సిపల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన ద్రోహాన్ని, ఇచ్చిన హామీల అమలులో విఫలమై మోసం చేసిన తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూల వాతావరణం నెలకొందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న వారం రోజులపాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోయాయని, అప్పట్లో కాంగ్రెస్, బీజేపీలు కేవలం ఏడెనిమిది స్థానాలకే పరిమితమైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సమన్వయం కీలకం..

ఎన్నికల వ్యూహంలో భాగంగా సమన్వయం కీలకమని కేటీఆర్ స్పష్టం చేశారు. చాలా చోట్ల పార్టీ విజ్ఞప్తిని మన్నించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను సాదరంగా ఆహ్వానించాలని కోరారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి త్యాగం చేసిన ప్రతి నాయకుడి ఇంటికి అభ్యర్థులు స్వయంగా వెళ్లి, వారిని ప్రచారంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. వారికి తగిన గౌరవం ఇచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన బాధ్యత మున్సిపల్ సమన్వయకర్తలపై ఉన్నదన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. ప్రచారంపై దృష్టి సారిస్తూ, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో విజయావకాశాలను అంచనా వేసి, గెలుపు గుర్రాలను గట్టెక్కించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అభ్యర్థుల గెలుపుతో పాటు పోలింగ్ రోజున ఓటింగ్ శాతం పెంచడంపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మున్సిపల్ కోఆర్డినేటర్లు తమకు కేటాయించిన క్షేత్రాల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు.

Next Story