- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
వ్యూహాలు ప్రతి వ్యూహాల మధ్య మున్సిపల్ ఎన్నికల అంకం ముగిసింది. vv

దిశ, ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. సోమవారం జిల్లావ్యాప్తంగా జరిగిన మేయర్, చైర్మన్ల ఎన్నికతో పురపాలక సంఘాల్లో కొత్త సారథులు కొలువుదీరారు. రాజకీయ ఎత్తుగడలు, ఉత్కంఠ భరిత సమీకరణాల మధ్య సాగిన ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పీఠాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు, వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ సంచలనం సృష్టించగా, నారాయణపేటలో బీజేపీ, అయిజ మరియు అలంపూర్‌లలో బీఆర్ఎస్ తమ ఉనికిని చాటుకున్నాయి. చదువుకున్న యువత నుంచి సామాన్య మహిళల వరకు ఈసారి పుర పీఠాలను అధిరోహించడం విశేషం. జిల్లావ్యాప్తంగా నూతన పాలకమండళ్లు కొలువుదీరడంతో పట్టణ పాలనలో సరికొత్త అధ్యాయం మొదలైంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అత్యంత ఉత్కంఠ భరితంగా ముగిసింది. సోమవారం ఆయా మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు బాధ్యతలు స్వీకరించడంతో పురపాలక సంఘాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాల మధ్య సాగిన ఈ పట్టాభిషేక మహోత్సవంలో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పీఠాలను కైవసం చేసుకోగా, వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్, నారాయణపేటలో బీజేపీ, అలంపూర్ మరియు అయిజలో బీఆర్ఎస్ పార్టీలు తమ సత్తా చాటాయి.
పాలమూరు పీఠంపై మమతకు మేయర్ యోగం
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం ఫుల్‌స్టాప్ పెట్టింది. పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, ఊహించని విధంగా 3వ డివిజన్ కార్పొరేటర్ జి. మమతను మేయర్ పీఠం వరించింది. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయంతో మమత వైపు అధిష్టానం మొగ్గు చూపగా, డిప్యూటీ మేయర్‌గా మారేపల్లి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించడంతో పాలమూరు నగర పాలనలో సరికొత్త నాయకత్వం కొలువుదీరింది. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.
వడ్డేపల్లిలో ‘సింహం’ గర్జన.. సామాన్యురాలికి పట్టాభిషేకం
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. తెలంగాణ మున్సిపల్ చరిత్రలోనే అరుదుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీ ఇక్కడ పీఠాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. 10 వార్డులకు గాను 8 స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీ తరపున 4వ వార్డు కౌన్సిలర్ మంజుల ధర్మ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కేవలం ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న సామాన్య మహిళ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదృష్టం మంజులమ్మను వరించగా, వైస్ చైర్మన్‌గా సారమ్మ బాధ్యతలు చేపట్టారు.
నారాయణపేటలో డీకే అరుణ మార్క్ రాజకీయం
నారాయణపేట మున్సిపల్ పీఠంపై ఎట్టకేలకు కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తన వ్యూహంతో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చి పార్టీ అభ్యర్థిని చైర్‌పర్సన్ పీఠంపై కూర్చోబెట్టారు. ముఖ్యంగా ఈ ఎన్నికలో రాజకీయ 'అత్తాకోడళ్ల' మధ్య జరిగిన ఆధిపత్య పోరులో చివరకు అత్త కొండ శ్వేతనే పైచేయి సాధించడం గమనార్హం. ఎక్స్ అఫీషియో ఓట్ల బలం తోడవ్వడంతో బీజేపీ అభ్యర్థి కొండ శ్వేత సత్య యాదవ్ చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా మంజుల ఎన్నికయ్యారు. ఇటు అయిజ మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. 13 వార్డుల మెజారిటీతో సీఎం సురేష్ చైర్మన్‌గా, నర్సింహులు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
మక్తల్ పీఠంపై ‘వాకిటి’ ముద్ర.. కోస్గిలో హస్తం క్లీన్ స్వీప్
మక్తల్ మున్సిపల్ చైర్మన్ ఎంపికపై మంత్రి వాకిటి శ్రీహరి విధేయతకే పట్టం కట్టారు. 'దిశ' ముందే పసిగట్టినట్లుగా 14వ వార్డు కౌన్సిలర్ వాకిటి మానసను చైర్మన్ పదవి వరించగా, వైస్ చైర్మన్‌గా శైవిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వడం ద్వారా పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మంత్రి ఆకాంక్షించారు. మరోవైపు కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుతూ మొత్తం 16 వార్డులను కైవసం చేసుకుంది. అక్కడ నాగులపల్లి నరేందర్ చైర్మన్‌గా, సరిత వైస్ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రజాసేవలో బీటెక్ విద్యార్థినులు.. ఖాకీ మనసులో మాతృత్వం
ఈ ఎన్నికలు సరికొత్త మార్పులకు వేదికయ్యాయి. చదువుకుంటూనే ప్రజాసేవపై మక్కువతో ఎన్నికల బరిలో నిలిచిన కొత్తకోట మున్సిపాలిటీ విద్యార్థిని జే. అఖిల, అలంపూర్ 9వ వార్డు విద్యార్థిని కే. మాధురి కౌన్సిలర్లుగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. చేతిలో బీటెక్ పట్టా ఉన్నా వార్డు సేవ కోసం రాజకీయాల్లోకి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో పెబ్బేరులో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన ఓ చిన్నారిని ఎత్తుకొని లాలించిన మహిళా కానిస్టేబుల్ శివాని దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విధుల్లో కఠినత్వమే కాదు, ఖాకీ మనసులోనూ కమ్మని లాలి ఉంటుందని ఆమె నిరూపించారు.
అభివృద్ధి లక్ష్యంగా బాధ్యతల స్వీకరణ
ఉమ్మడి జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీలైన భూత్పూర్, దేవరకద్ర, పెబ్బేరు, కొల్లాపూర్, మద్దూరులలో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది. భూత్పూర్ చైర్మన్‌గా బాలకోటి, దేవరకద్ర చైర్‌పర్సన్‌గా దమయంతి, పెబ్బేరు చైర్మన్‌గా అక్కి శ్రీనివాస్ గౌడ్, కొల్లాపూర్ చైర్‌పర్సన్‌గా రెడ్డి జ్యోతి, మద్దూరు చైర్‌పర్సన్‌గా సరస్వతి బాధ్యతలు చేపట్టారు. వనపర్తిలోనూ నూతన చైర్ పర్సన్ మిడిదొడ్డి మాధవిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి అభినందిస్తూ అభివృద్ధిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పట్టణ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సామాన్యుల నుండి ఉన్నత విద్యావంతుల వరకు మున్సిపల్ పీఠాలపై కొలువుదీరడంతో జిల్లా ప్రజలు కొత్త ఆశలతో ఎదురుచూస్తున్నారు.






