రాజకీయ సెగ: మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి.. కో-ఆప్షన్ కుర్చీలాట మొదలైంది

by Malleboina Mahesh |

ముగిసిన మున్సిపల్ పోరు.. మొదలైన కో-ఆప్షన్ సెగ! హుజూరాబాద్, జమ్మికుంటలో పదవుల కోసం ఆశావహుల పైరవీలు. నిబంధనల నడుమ నేతల మంత్రాంగం.

రాజకీయ సెగ: మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి.. కో-ఆప్షన్ కుర్చీలాట మొదలైంది
X

హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం ముగియగానే ఇప్పుడు కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక సెగ మొదలైంది. నామినేటెడ్ పదవులైన ఈ ‘కో-ఆప్షన్’ కుర్చీలపై కన్నేసిన ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పైరవీలు షురూ చేశారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు కరుణాకటాక్షాల కోసం పార్టీ కేడర్ వేయికళ్లతో ఎదురుచూస్తోంది. జమ్మికుంటలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏ మంత్రాంగం నడిపి ఎవరికి పట్టం కడతారన్నది స్థానికంగా ఆసక్తి రేపుతోంది. రిజర్వేషన్లు, సీనియారిటీ నిబంధనల నడుమ ఈ పదవులు దక్కించుకోవాలని ద్వితీయ శ్రేణి నాయకులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అధికారిక నోటిఫికేషన్ రాకముందే నేతల ఇళ్ల వద్ద క్యూ కడుతున్న ఆశావహులతో హుజూరాబాద్ రాజకీయం మరోసారి వేడెక్కింది.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజూరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్, జమ్మికుంటను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఆయా పార్టీల్లో పదవుల కోసం పోటీ పెరిగింది. హుజూరాబాద్‌లో ప్రణవ్ బాబు సిఫార్సు ఉంటేనే పదవి దక్కుతుందన్న నమ్మకంతో పదిమందికి పైగా ఆశావహులు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటు జమ్మికుంటలో బీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మాజీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన వారికే ప్రాధాన్యత ఉంటుందా? లేక సామాజిక సమీకరణాలు తోడవుతాయా? అన్నది నియోజకవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ సమీకరణాలు ఇవే..

గత నెల 11న జరిగిన హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోరు సాగింది. హుజూరాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులకు గాను కాంగ్రెస్-16 స్థానాల్లో విజయం సాధించగా, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో బలం 17కు చేరింది. ఇక్కడ స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ పాగా వేసింది. జమ్మికుంట మున్సిపాలిటీలో పోరు రసవత్తరంగా సాగింది. బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, బీజేపీ 4 స్థానాలు గెలుచుకోగా.. ఇండిపెండెంట్లు, ఎక్స్-అఫీషియో ఓటు (ఎమ్మెల్యే) మద్దతుతో బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.

ఎంపిక నిబంధనలు.. రిజర్వేషన్ల లెక్కలు..

కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో నలుగురు సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఉండగా, అందులో ఇద్దరు మైనార్టీ (ముస్లిం, క్రిస్టియన్) వర్గాల నుంచి ఉండాలి. మిగిలిన ఇద్దరు జనరల్ కోటాలో ఉండాలి, వీరికి గతంలో ఐదేళ్లపాటు ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం తప్పనిసరి. అలాగే మొత్తం పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారిని వెతికి పట్టుకుని, వారిని తమ వైపు తిప్పుకోవడంలో నాయకులు నిమగ్నమయ్యారు.

నేతల నిర్ణయమే శిరోధార్యం..

గత మున్సిపల్ ఎన్నికల తర్వాత జమ్మికుంట, హుజురాబాద్‌లలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కో-ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయకపోవడం గమనార్హం. కానీ ఈసారి సమీకరణాలు మారాయి. హుజూరాబాద్‌లో ప్రణవ్ బాబు కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడ్డ వారిని గుర్తించే పనిలో ఉండగా, జమ్మికుంటలో కౌశిక్ రెడ్డి తన అనుచర వర్గాన్ని సంతృప్తి పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన 45 నుంచి 60 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండడంతో, రాజకీయ తెర వెనుక చక్రం వేగంగా తిరుగుతుంది.

Next Story