TG: మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్, సీపీఐ మధ్య కుదరని పొత్తు?

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జెండా పాతాలని వ్యూహాలు రచిస్తున్నాయి.

TG: మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్, సీపీఐ మధ్య కుదరని పొత్తు?
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections)ను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జెండా పాతాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే గెలిచే అవకాశాలు ఉన్న ప్రతీచోట పొత్తులతో ముందుకు వెళ్తున్నాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నుంచి మిత్రపక్షాలుగా కొనసాగుతున్న కాంగ్రెస్, సీపీఐలు.. మునిసిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారుతాయని తెలుస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రాతినిథ్యం వహివస్తున్న భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్లో ఈ పార్టీల మధ్య పొత్తు కుదరకపోవటంతో ఇతర చోట్ల కూడా ఎవరికి వారే నామినేషన్లు వేశారు. 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెంలో సీపీఐ 30 డివిజన్లు ఇవ్వాలని కోరగా, కాంగ్రెస్ 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేసింది. చివరకు 25 డివిజన్లు అయినా ఇవ్వాలని సీపీఐ కోరినా.. కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీంతో శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావటంతో సీపీఐ అభ్యర్థులు మొత్తం 60 డివిజన్లలోనూ నామినేషన్లు వేశారు. కొందరు టీడీపీ సానుభూతిపరులు కూడా సీపీఐ తరఫున నామినేషన్లు వేసినట్టు తెలిసింది.

భట్టి, పొంగులేటి ఇలాఖాలోనూ ఇదే పరిస్థితి

అంతేకాదు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులుండగా, 15 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు, మొత్తం 32 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిథ్మం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో 22 వార్డులుండగా.. పొత్తు కుదరకపోవడంతో సీపీఐ ఐదు చోట్ల నామినేషన్ వెయ్యగా మొత్తం అన్ని చోట్లా కాంగ్రెస్ నేతలు నామినేషన్లు వేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, సీపీఐ సొంతంగానే పోటీ చేస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీల మధ్య భవిష్యత్తు ఎలా ఉండబోతోందని చర్చ మొదలైంది.

Next Story