ఆ లక్ష వాహనాలకు టోల్ రిఫండ్.. ఎందుకంటే?

by Muthe.Rajitha |

ఇటీవల ముంబయి–పుణే ఎక్స్‌ప్రెస్‌వే పై జరిగిన ఓ ఘటనకు సంబంధించి 1.2 లక్షల వాహనాలకు రూ.5.6 కోట్ల టోల్ రిఫండ్ ఇవ్వనున్నారు.

ఆ లక్ష వాహనాలకు టోల్ రిఫండ్.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో ఫిబ్రవరి 3న జరిగిన ఓ భారీ ప్రమాదం ముంబయి–పుణే ఎక్స్‌ప్రెస్‌వే రవాణాను పూర్తిగా స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఖోపోలి సమీపంలోని ఆదోషి టన్నెల్ వద్ద ఒక ప్రొపిలీన్ గ్యాస్ ట్యాంకర్ ఢలాన్‌పై నియంత్రణ కోల్పోయి పల్టీ కొట్టింది. ప్రొపిలీన్ అత్యంత మండే స్వభావం ఉన్న గ్యాస్ కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే ఎక్స్‌ప్రెస్‌వేను బ్లాక్ చేశారు. ట్యాంకర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడంతో అధికారులు వెంటనే రహదారిని మూసివేయడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి.

దాదాపు 33 గంటలపాటు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది కార్లు, బస్సులు, ట్రక్కుల ఎక్స్‌ప్రెస్‌వే మీదనే ఇరుక్కుపోయాయి. అనేక మంది ప్రయాణికులు రాత్రంతా తమ వాహనాల్లోనే గడపాల్సి వచ్చింది. ఈ ఘటనలో మహారాష్ట్ర బడా వ్యాపారవేత్త సుధీర్ మెహతా హెలికాప్టర్‌ను బుక్ చేసుకుని అక్కడి నుంచి బయటపడ్డారని వార్తలు వైరల్ కావడం మరింత చర్చకు దారితీసింది.

రీఫండ్ ఎందుకు..?

అయితే ప్రమాదం అనంతరం టోల్ వసూళ్లపై కూడా తీవ్ర వివాదం చెలరేగింది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) టోల్ వసూలు తక్షణమే ఆపాలని ఆదేశాలు ఇచ్చినా, కొంతమంది ప్రయాణికుల FASTag ఖాతాల నుంచి టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గా కట్ కావడంతో పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆయా వాహనాలకు దాదాపు రూ. 5.16 కోట్ల రిఫండ్ ప్రకటించింది. సుమారు 1.2 లక్షల మంది వాహనదారులకు.. ముంబయి–పుణే ఎక్స్‌ప్రెస్‌వే మాత్రమే కాకుండా పుణే–బెంగళూరు హైవేపై వసూలైన టోల్ మొత్తాలు కూడా FASTag ఖాతాలకే నేరుగా క్రెడిట్ చేయాలని నిర్ణయించారు.

అవసరమైన డేటా సేకరణ పూర్తిచేసి ఫిబ్రవరి చివరి వారంలో రిఫండ్ జమ చేయడం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో ఇలా టోల్ రిఫండ్ చేయడం ఇదే మొదటిసారి కాకపోయినా, ఇంత పెద్ద స్థాయిలో లక్షకు పైగా వాహనదారులకు టోల్ రిఫండ్ చేయడం గమనార్హం.

Next Story