- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

ప్రియమైన అఫ్రీన్ ఫాతిమా!
నీ పక్కటెముకలు పగుళ్లు వారడాన్నీ,
లోలోపలి ఎముకలు రక్తాన్ని
స్రవించడాన్ని నేను చూడగలను!
నీ కళ్ళు మొద్దు మారిపోయాయి!
కన్నీళ్లు మంచులా ఘనీభవించిపోయాయి!
నీ చేతులు వజ వజ వణికి పోవడాన్ని,
కాళ్లు కదలలేనంత బరువుగా
మారడాన్ని నేను చూస్తున్నాను!
నీ గుండె స్పందన డప్పులా
మోగుతుండడాన్ని,
శ్వాస వేగంగా పరిగెడుతుండడాన్ని
నేను చూడ గలుగుతున్నాను!
అఫ్రీన్! నువ్వు ఒంటరిగా నిలబడి
బుల్డోజర్లు చేసే విధ్వంసాన్ని
విహ్వలంగా చూడడాన్ని
నేను చూడ గలుగుతున్నాను!
నీ ప్రియమైన ఇంటి జ్ఞాపకాలు,
వెచ్చని ప్రార్థనలు,
నీకు ఇష్టమైన టీ పాట్,
అమ్మ ప్రార్థన చేసుకునే గది,
అన్నీ నిర్దాక్షిణ్యంగా ధ్వంసం అవడాన్ని,
నువ్వు ఘనీభవించిన
మనసుతో చూస్తూ ఉండడాన్ని,
ప్రియమైన అఫ్రీన్ ఫాతిమా!
నేనూ చూస్తున్నాను!
అబ్బూ.. పూల కుండి
టేబుల్ మీద కంపించిపోవడాన్ని,
భారీగా ఉండే బూట్లు కర్కశంగా
ఆ పూల రెక్కలను నులిమేయడాన్ని
నీతో పాటు నేనూ చూస్తున్నాను!
నువ్వు ఎంతో ప్రేమించిన పుస్తకాలు
బురదలో పడి ముద్ద అవడాన్ని,
ఇసుక రేణువుల్లా నుజ్జు నుజ్జు
అవడాన్ని నేను చూస్తున్నాను!
నువ్వు అయోమయంగా నిలబడి
దేన్ని, ఎలా కాపాడుకోవాలో తెలియక
నీ ప్రాణపదమైన ఇంట్లోని ప్రతి చిన్నదాన్నీ,
నీ హృదయానికి దగ్గరగా ఉన్న వాటిని
ఎలా దక్కించుకోవాలో తెలియక దుఃఖంతో
కూలబడిపోవడాన్ని నేను చూస్తూన్నాను!
నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించిన భారతదేశం
బుల్డోజర్ల కింద ధ్వంసం అవ్వడాన్ని
కన్నీళ్ళతో నువ్వు నిస్సహాయంగా
చూడడాన్ని నేనూ చూస్తున్నాను !
ఆ రాక్షసుల కరతాళ ధ్వనుల మధ్య,
నీ స్నేహితుల కుట్రా నిశబ్దం
నీ గొంతు నులిమేయడాన్ని
నేను చూస్తున్నాను! అయినా సరే!
నువ్వు చచ్చుబడిన నాలుకతో,
పెగలని మాటలతో నిశ్చేష్టగా నిలబడి
ఉండడాన్ని నేను చూస్తూన్నాను !
(నోట్: రాజ్యం నిరంకుశంగా, యాంటీ సీఏఏ కార్యకర్త అయిన ఆఫ్రీన్ ఫాతిమా ఇంటిని బుల్డోజర్లతో ధ్వంసం చేసినందుకు నిరసనగా రాసింది)
మూలం- మౌమితా ఆలం
అనువాదం -గీతాంజలి.






