- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైవే పై ట్రాఫిక్.. టోల్ ప్లాజా నిర్మాణ పనులతో వాహనదారులకు తప్పని కష్టాలు
ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిన చందంగా టోల్ ప్లాజా నిర్మాణ పనులతో హైవేపై రాకపోకలు సాగించే వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.

దిశ, భిక్కనూరు : ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిన చందంగా టోల్ ప్లాజా నిర్మాణ పనులతో హైవేపై రాకపోకలు సాగించే వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. గత కొంతకాలంగా ప్లాజా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా నిర్మాణ పనులు గత మూడు, నాలుగు నెలలుగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఒక వైపు నిర్మాణ పనులను పూర్తి చేసి, మరో వైపు నిర్మాణ పనులు చేపట్టి ఉంటే 44వ జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఆ విధంగా చేయకుండా సిమెంట్ రోడ్లతో పాటు ప్లాజా బూత్‌లకు సంబంధించిన ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణ పనులు, సిమెంట్ రోడ్లు వేయడం, కార్యాలయాల నిర్మాణ పనులు చేపడుతున్నారు.
దీంతో రెండు వైపులా సింగిల్ వే ద్వారా వాహనాల రాకపోకలకు అనుమతించడం, పైగా 500 మీటర్ల దూరంలోనే టోల్ ప్లాజా ఉండడం వల్ల వాహనాలు ఒకదాని వెనుక మరొకటి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఒక్కోసారి 44వ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా సాగుతుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గత మూడు, నాలుగు రోజుల క్రితం ప్లాజాకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు జామ్ అయ్యాయి. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్లాజా సిబ్బంది పడరాని పాట్లు పడ్డారు. అది జరిగిన మరుసటి రోజు కూడా గంటపాటు ట్రాఫిక్ సమస్య పునరావృతం కావడంతో వాహనదారులు, రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుకు ఒకసారైనా ఏదో ఒక రకంగా ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది. టోల్ ప్లాజా నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఈ కష్టాలు తప్పవన్న భావన వాహనదారులు, ప్రయాణికుల్లో నెలకొంది.
ప్లాజా సమీపంలోనే తనిఖీలు..
అసలే టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు, సమీపంలోని రోడ్డుపైనే వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించడం మరో కారణంగా మారింది. పోలీసులు, రవాణా శాఖ అధికారులు క్రమం తప్పకుండా అదే ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండడం, టోల్ ప్లాజా నిర్మాణ పనుల వల్ల వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది.






