- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో ఏం జరుగుతోంది? 15 రోజుల్లో 800 మందికి పైగా మిస్సింగ్
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మిస్సింగ్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మిస్సింగ్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. జనవరి 1 నుంచి 15వ తేదీ మధ్య కేవలం 15 రోజుల వ్యవధిలోనే 800 మందికి పైగా అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అంటే రోజుకు సగటున 50 మందికి పైగా కనిపించకుండా పోతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు కనబడకుండా పోవడం సాధారణ విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రెండు వారాల్లో వందల మంది మిస్సయ్యారనే వార్తలు బయటికి పొక్కడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? ఎందుకు ఇంతమంది మిస్సింగ్ అవుతున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మిస్సింగ్ అయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 800 మందిలో సుమారు 500 మంది మహిళలు అని పోలీసులు తెలిపారు. అలాగే దాదాపు 200 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఇందులో చాలా మంది టీనేజ్ అమ్మాయిలు ఉన్నారని సమాచారం. కొందరు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మరికొందరు స్కూల్, జాబ్, షాపింగ్ అంటూ వెళ్లి కనిపించకుండా పోయారు. దేశ రాజధానిలో ప్రస్తుత పరిస్థితి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను తీవ్రంగా కలవరపెడుతోంది.
అయితే పోలీసులు ఇప్పటివరకు కొంతమందిని గుర్తించి తిరిగి కుటుంబాలకు అప్పగించారు. కానీ ఇంకా 500 కంటే ఎక్కువమంది జాడ దొరకలేదు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపడం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం పడుతోందని, ఇవన్నీ సాధారణ మిస్సింగ్ కేసులేనని... త్వరలోనే వీటిని పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు వివరణ ఇస్తున్నారు.
అయితే ఈ మిస్సింగ్ కేసుల వెనుక అనేక కారణాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో గొడవలు, ప్రేమ వ్యవహారాలు వల్ల కొందరు ఇంటి నుంచి వెళ్లిపోవడం ఒక కారణం. అలాగే ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి కుటుంబానికి సమాచారం ఇవ్వకపోవడం కూడా జరుగుతోంది. అయితే మహిళలు, పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ట్రాఫికింగ్, క్రిమినల్స్ పాత్ర ఉందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.






