భారీగా కురుస్తున్న మంచు... 100 కు పైగా వాహనాలు ఢీ

by Muthe.Rajitha |

అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో సోమవారం ఉదయం భారీ మంచు తుఫాన్ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

భారీగా కురుస్తున్న మంచు... 100 కు పైగా వాహనాలు ఢీ
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో సోమవారం ఉదయం భారీ మంచు తుఫాన్ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లేక్ మిచిగాన్ నుంచి వచ్చిన లేక్-ఎఫెక్ట్ స్నో వల్ల ఇంటర్‌స్టేట్-196 హైవేపై హడ్సన్‌విల్ సమీపంలో మంచు కురవడం, గంటకు 40 మైళ్ల వరకు గాలివేగం, రోడ్లపై మంచు పేరుకుపోగా... దాదాపు 100కుపైగా కార్లు, ట్రక్కులు, సెమీ-ట్రైలర్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30 నుంచి 40 సెమీ-ట్రక్కులు ధ్వంసమయ్యాయి. I-196 రహదారిని సుమారు 10 మైళ్ల మేర పూర్తిగా మూసివేశారు. ఈ ప్రమాదంలో 12 మందికి స్వల్ప గాయాలు కాగా.. ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

సహాయక చర్యల కోసం మిచిగాన్ స్టేట్ పోలీస్‌, ఓటావా కౌంటీ షెరిఫ్‌ సిబ్బంది భారీగా రంగంలోకి దిగారు. రోడ్డుపై చిక్కుకుపోయిన వారిని హడ్సన్‌విల్ హైస్కూల్‌ బస్సుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిచిగాన్ అంతటా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన అధికారులు.. అత్యవసరం కాకపోతే బయటకు వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. భారీ మంచు కారణంగా వాహనదారులు నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలని, వాహనాల మధ్య దూరం పాటించాలని సూచించారు.

Next Story