జర్నలిస్టుల జీవితాలపై మోనోగ్రాఫ్స్: మీడియా అకాడమీ చైర్మన్

by Malleboina Mahesh |

జర్నలిస్టుల సంక్షేమం మరియు శిక్షణకు తెలంగాణ మీడియా అకాడమీ పెద్దపీట వేస్తోంది. మరణించిన 120 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 1 లక్ష ఆర్థిక సాయంతో పాటు ఐదేళ్ల పాటు నెలకు రూ. 3 వేల పెన్షన్ అందించాలని నిర్ణయించింది.

జర్నలిస్టుల జీవితాలపై మోనోగ్రాఫ్స్: మీడియా అకాడమీ చైర్మన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మీడియా అకాడమీ కట్టుబడి ఉందని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ మీడియా అకాడమీ కాన్ఫరెన్స్ హల్ లో 2వ పాలకమండలి సమావేశం చైర్మన్ అధ్యక్షతన జరిగింది. తెలంగాణలోని 8 జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమాలు, వివిధ అంశాలపై 7 వర్క్ షాప్ లు, 12 మంది సీనియర్ జర్నలిస్టులు చేసిన సేవలను రాబోయే తరాలకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతో వారి జీవితాలపై మోనోగ్రాఫ్స్ (చిరు పుస్తకాలు) ముద్రించినట్లు ఆయన తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమం లో భాగంగా విడతల వారీగా 120 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం, 5 ఏళ్ల కాల పరిమితితో నెలకు రూ.3వేల పెన్షన్ సదుపాయం కల్పించినట్లు ఆయన వివరించారు. అనారోగ్యం, ప్రమాదాలకు గురైన 19 మంది జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేశామన్నారు. అకాడమీ భవన నిర్వహణలో భాగంగా 250 మంది సీటింగ్ కెపాసిటీ గల ఆడిటోరియం అద్దెకు ఇవ్వడానికి సమావేశంలో చర్చించగా కమిటీ సభ్యులు తమ ఆమోదం తెలపడం పట్ల కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మీడియా అకాడమీ భవన నిర్వహణలో భాగంగా ఆడిటోరియం అద్దెకు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తునే ఈ విధానం పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా మీడియా అకాడమి వెబ్ సైట్ లో ఆయా తేదీలు, సమయ పాలన పొందుపర్చాలని సూచించారు. అప్పుడే పూర్తి పారదర్శకత చేకూరుతుందని వారు వెల్లడించారు. అందుకోసం ప్రభుత్వ ఆధీనంలోని రవీంద్రభారతి, జె.ఎన్.టి.యూ., సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయాకు సంబంధించిన విధి, విధానాలను అధ్యయనం చేసి అద్దెకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని మీడియా అకాడమీ కార్యదర్శికి సూచించారు.

సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ శ్రీమతి సి.హెచ్. ప్రియాంక, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ డా. సతీష్ కుమార్ తల్లాడి, డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఇంచార్జి హెడ్ డా. సునీల్ కుమార్ పోతన, దూరదర్శన్ కేంద్ర ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీమతి ఎ.చాందిని, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.రమేష్ సుంకసారి, స్పెషల్ గెస్ట్ వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ బి.వి.కృష్ణా రావు, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

Next Story