- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచే స్కూల్స్ పునః ప్రారంభం..అల్పాహారం పథకం కూడా !
వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.

దిశ, హైదరాబాద్ బ్యూరో: వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 691 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 500 ప్రాథమిక పాఠశాలలు, 9 ప్రాథమినోన్నత పాఠశాలలు, 182 ఉన్నత పాఠశాలలు ఉండగా సుమారు 1.35 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా గత విద్యాసంవత్సరం పూర్తయిన తర్వాత ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సెలవును 14వ తేదీ వరకు పొడిగించింది.
విద్యార్థులకు గుడ్ న్యూస్
పిల్లలు ఖాళీ కడుపుతో పాఠశాలలకు రాకూడదని తెలంగాణ ప్రభుత్వం ఈ పర్యాయం సరికొత్త మార్గదర్శకాలతో పౌష్టికాహార పథకం ప్రవేశ పెట్టింది. జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం అందించడం కోసం దీనిని అమలు చేయనుంది. ప్రతిరోజూ ఉదయం బడి ప్రారంభం కావడానికి ముందే వేడివేడిగా ఈ అల్పాహారాన్ని వడ్డిస్తారు. అల్పాహారంతో పాటు వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ అందిస్తారు. చిన్న పిల్లలకు 75 మి.లీ., పెద్ద పిల్లలకు 100 మి.లీ. చొప్పున పాలు ఇస్తారు.
మెనూ ఇలా..
సోమవారం దోశ - చట్నీ లేదా సాంబారు. మంగళవారం మిల్లెట్ (చిరుధాన్యాల) ఇడ్లీ, సాంబారు. బుధవారం పూరీ, వెజిటబుల్ కుర్మా. గురువారం బోండా చట్నీ. శుక్రవారం ఇడ్లీ సాంబారు. శనివారం ఉప్మా చట్నీ లేదా సాంబారు
మొదటి దశలో జిల్లాలో 45 పాఠశాలల్లో అమలు: డీఈఓ యాదయ్య
హైదరాబాద్ జిల్లాలో అల్పాహారం పథకం అమలులో భాగంగా మొదటి విడతలో 45 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. పాఠశాలల పున: ప్రారంభం రోజైన సోమవారం రాజ్‌భవన్ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిని ప్రారంభించనున్నారు. మన్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలు చేయనున్న ఈ పథకం మొదటి దశలో 45 పాఠశాలలలో మొత్తం 12,437 విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలలో డ్రాపౌట్ శాతం తగ్గించే దిశగా మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉదయం విద్యార్థులకు అందించే అల్పాహారం మెనూలోని మిల్లెట్ ఇడ్లీ సాంబార్, మిక్స్డ్ వెజ్ కుర్మాతో పూరీ, చట్నీతో బోండా, ఉప్మా చట్నీ అలాగే దోశ అందిస్తారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యసిస్తున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, అలాగే నోట్ పుస్తకాలు అందించనున్నారు.






