- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంకుస్థాపన జరిగినా కదలని పనులు!
స్టేడియం అభివృద్ధి పనులకు శాప్ చైర్మన్ ఇప్పటికే శంకుస్థాపన నిర్వహించారు.

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర క్రీడా రంగానికి చారిత్రాత్మక గుర్తింపుగా నిలిచిన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం(ఐజీఎంసీ) త్వరలోనే కొత్త రూపు సంతరించుకోనుందా? అంతర్జాతీయ ప్రమాణాలతో అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు అవుతుందా? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. స్టేడియాన్ని ఆధునికీకరించి బహుళ ప్రయోజనాల క్రీడా వేదికగా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ప్రతిష్ఠాత్మక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా స్టేడియంలో అత్యాధునిక అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణం, ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలు, క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ వసతులు, డ్రెస్సింగ్ రూములు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను ప్రతిపాదనల్లో పొందుపరిచారు.
కదలని పనులు
స్టేడియం అభివృద్ధి పనులకు శాప్ చైర్మన్ ఇప్పటికే శంకుస్థాపన నిర్వహించారు. ఇది జరిగి చాలా కాలం గడిచినా పనులు ప్రారంభం కాకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టు అమలులో జాప్యం ఎందుకు జరుగుతోందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అథ్లెట్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన అథ్లెట్లు ఎందరో ఉన్నారు. కానీ అంతర్జాతీయ ప్రమాణాల ట్రాక్ లేకపోవడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందాల్సి వస్తోంది.
కేంద్ర నిధులతో రీనోవేషన్‌కు యోచన...
ఇందిరాగాంధీ స్టేడియం పునరుద్ధరణ పనులను కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నిధుల మంజూరు అయినప్పటికీ పనులు వేగవంతం కాకపోవడంతో క్రీడాకారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని క్రీడాకారులు, స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం ఆధునికీకరణపై ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలే అథ్లెటిక్స్ ట్రాక్ కలను నిజం చేస్తాయా..? లేక మరో ప్రకటనగానే మిగిలిపోతాయా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






