నర్సాపూర్ పట్టణంలో కోతుల బీభత్సం.. బయటకు రావాలంటే జంకుతున్న జనం

by Jakkula.Mamatha |

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో, గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకు తీవ్రతరమవుతుంది.

నర్సాపూర్ పట్టణంలో కోతుల బీభత్సం..  బయటకు రావాలంటే జంకుతున్న జనం
X

దిశ, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో, గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకు తీవ్రతరమవుతుంది. ఇంటి నుంచి అడుగు బయటకు వేద్దామంటేనే జనాలు హడలెత్తి పోతున్నారు. గ్రామాల్లో రోజుకు ఒక్కరినైనా దాడి చేసి కోతులు గాయపరుస్తున్నాయి. ఇక ఇంటి తలుపులు తీసి ఉన్నాయంటే ఇల్లును గుల్ల చేసి నానా విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇక చిన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లి రావాలంటేనే ప్రాణాలను అరి చేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఒంటరిగా కోతులకు దొరికారంటే వాళ్ల ప్రాణం గాల్లో కలిసినట్టే. నర్సాపూర్ మున్సిపాలిటీలో కోతులను పట్టి తరలించిన అక్కడక్కడ కోతులు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

రోజుకు సుమారు 10 కేసులు..

కోతుల దాడిలో గాయపడిన వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు 10 కేసులు ప్రభుత్వ దవాఖానాలో నమోదవుతున్నాయంటే కోతుల తీవ్రత ఎంత ఉందో అంచనా వేయవచ్చు. జూలై ఒక నెలలోనే 148 కోతులు కరిచిన కేసులు నమోదయ్యాయి అంటే కోతుల దాడులు ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయొచ్చు. అధికారికంగా లెక్క ఇలా ఉంటే అనధికారికంగా ఇంకెలా ఉంటుందో అంచనా వేయవచ్చు. అలాగే దావకానకు వచ్చే వారి సంఖ్య ఇలా ఉంటే ఇంకా రాని వారి సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చు. కోతుల దాడిలో గాయపడ్డ జనాలు ఏ ఆర్ వి కోసం క్యూ కడుతున్నారు. మరికొందరైతే ఇంజక్షన్లు వేసుకోవడానికి భయపడుతూ దావాఖానాకు కూడా వెళ్లడం లేదు. దీంతో భవిష్యత్తులో వారి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని పలువురు భావిస్తున్నారు.

ఖర్చుకు వెనుకాడుతున్న గ్రామపంచాయతీలు ..

కోతులను పట్టి గ్రామాల నుంచి తరలించడానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం వెనకాడుతున్నాయి. కోతులను పట్టే వారు ఒక్కో కోతికి సుమారు 200 వరకు ఛార్జ్ చేయడంతో గ్రామ పంచాయతీ బడ్జెట్ లేదని సాహసించడం లేదు. కోతుల బెడదతో గ్రామపంచాయతీ పాలకవర్గానికి పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వీటి కోసం ప్రత్యేకమైన నిధులను మంజూరు చేస్తే గ్రామాల నుంచి కోతులను తరలిస్తామని పలువురు సర్పంచులు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు అభివృద్ధి కంటే కోతుల నుండి మా ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నోరు మెదపని నాయకులు..

కోతుల దాడిలో ప్రజలు గాయపడుతున్న రాజకీయ నాయకులు మాత్రం నోరు మెదపడం లేదు. ఎన్నికల సమయంలో కొన్ని కొన్ని గ్రామాల్లో కోతుల బెడద తీరుస్తామని హామీలు ఇచ్చిన సర్పంచులు నేడు ముఖం చాటేస్తున్నారు. ప్రజల సమస్యలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధులు కోతుల సమస్య పై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద తీర్చకపోతే గ్రామాలకు వచ్చే నాయకులను, ప్రజా ప్రతినిధులను నిలదీస్తామని పలుచోట్ల గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు కల్పించుకొని కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని గ్రామాల, పట్టణాల ప్రజలు కోరుతున్నారు.

Next Story