ఆర్టీసీ బస్సు రూట్ మార్పు.. భగ్గుమంటున్న గ్రామాల ప్రజలు

by Taduka Kalyani |

జమ్మికుంట నుంచి గోదావరిఖనికి కొత్తగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సు రూట్ ను ఉన్నఫళంగా మార్చడంపై పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు రూట్ మార్పు.. భగ్గుమంటున్న గ్రామాల ప్రజలు
X

దిశ, కాల్వ శ్రీరాంపూర్ : జమ్మికుంట నుంచి గోదావరిఖనికి కొత్తగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సు రూట్ ను ఉన్నఫళంగా మార్చడంపై పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుతో తమకు కల్పించిన రవాణా సదుపాయం దూరమైందని ఆవేదన చెందుతున్నారు. గత వారం రోజుల క్రితం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దరాతుపల్లి గ్రామంలో జమ్మికుంట - గోదావరిఖని ఆర్టీసీ బస్సును లాంఛనంగా ప్రారంభించారు. ఈ బస్సు గుంపుల, మిర్జంపేట, కిష్టంపేట, మోట్లపల్లి గ్రామాల మీదుగా ప్రయాణించేలా రూట్ ఖరారు చేశారు. ప్రారంభించిన తొలి రెండు రోజుల పాటు బస్సు ఈ రూట్లోనే నడవడంతో.. ఆయా గ్రామాల ప్రజలు గోదావరిఖని, జమ్మికుంట పట్టణాలకు తమ వివిధ అవసరాల నిమిత్తం ఎంతో సంతోషంగా ప్రయాణించారు. అయితే, ఏమైందో ఏమో కానీ ఆర్టీసీ అధికారులు అకస్మాత్తుగా ఈ బస్సును మల్యాల, తారుపల్లి మీదుగా నడుపుతున్నారు. దీంతో తొలి రూట్ పరిధిలోని గ్రామాల ప్రజలు ఆర్టీసీ తీరుపై మండిపడుతున్నారు. మల్యాల, తారుపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలనుకుంటే మరో కొత్త బస్సును నడపాలి తప్ప, తమకు కేటాయించిన బస్సును దారి మళ్లించడం సరికాదంటున్నారు. కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గే ఆర్టీసీ అధికారులు ఈ విధంగా రూట్ మార్చారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే పాత రూట్లోనే బస్సును జమ్మికుంట నుండి గోదావరిఖనికి నడపాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆర్టీసీ అధికారుల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయా గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.

Next Story