ఆలూరులో మ్యాజిక్ డ్రైనేజీ నిర్మాణం.. పైలట్ ప్రాజెక్టుగా రెండు గ్రామాల ఎంపిక

by Jakkula.Mamatha |

గ్రామాల్లో మురుగునీటి నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో జిల్లా పరిపాలన చేపట్టిన పర్యావరణ హితం మ్యాజిక్ డ్రైనేజీ పైలట్ ప్రాజెక్టుకు ఆలూరు మండలంలోని ఆలూరు, జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లి గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి.

ఆలూరులో మ్యాజిక్ డ్రైనేజీ నిర్మాణం.. పైలట్ ప్రాజెక్టుగా రెండు గ్రామాల ఎంపిక
X

దిశ, ఆలూర్: గ్రామాల్లో మురుగునీటి నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో జిల్లా పరిపాలన చేపట్టిన పర్యావరణ హితం మ్యాజిక్ డ్రైనేజీ పైలట్ ప్రాజెక్టుకు ఆలూరు మండలంలోని ఆలూరు, జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లి గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆలూరు గ్రామంలో 90 మీటర్ల మేర మ్యాజిక్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గ్రామంలోని రహదారి పక్కన ప్రత్యేకంగా గుంతలు తవ్వి వాటిలో రాళ్లు, కంకర, ఇసుక పొరలను ఏర్పాటు చేసి మ్యాజిక్ డ్రైనేజీని నిర్మించారు. కాలువలో ప్రవహించే మురుగు నీరు, వర్షపు నీరు నేరుగా భూమిలోకి ఇంకిపోవడంతో నీరు నిల్వ ఉండకుండా దోమలు, ఈగల సమస్య తగ్గింది. అలాగే దుర్వాసన లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా మారాయి. ప్రతి 80 మీటర్లకు ఒక సోక్‌పిట్ ఏర్పాటు చేయడం వల్ల భారీ వర్షాల సమయంలో కూడా నీరు నిల్వ కాకుండా భూమిలోకి ఇంకిపోతుంది. దీంతో రోడ్లపై బురద, నీటి నిల్వలు, గుంతల సమస్యలకు కూడా చెక్ పడింది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం..

సాధారణంగా 100 మీటర్ల సిమెంట్ కాలువ నిర్మాణానికి సుమారు రూ.4 లక్షల వరకు వ్యయం అవుతుండగా, మ్యాజిక్ డ్రైనేజీ నిర్మాణం రూ.1 లక్షలోపే పూర్తవుతోంది. నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు నిర్వహణ ఖర్చు కూడా ఉండదు. వర్షపు నీరు, మురుగు నీరు భూమిలోకి ఇంకిపోవడంతో భూగర్భ జలాలు పెరిగి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతోంది.

నిర్వహణ భారం లేకుండా పారిశుద్ధ్యం మెరుగైంది : సర్పంచ్ ముక్కెర విజయ్ ఆలూర్

ఆలూరు సర్పంచ్ ముక్కెర విజయ్ మాట్లాడుతూ, గ్రామంలో 90 మీటర్ల మేర మ్యాజిక్ డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. కాలువలోకి చేరే మురుగునీరు, వర్షపు నీరు పూర్తిగా భూమిలోకి ఇంకిపోవడంతో కాలనీల్లో నీటి నిల్వలు లేకుండా పోయాయని, దోమలు, ఈగల బెడద తగ్గి పారిశుద్ధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు. ఈ వ్యవస్థకు ప్రత్యేక నిర్వహణ అవసరం లేకపోవడం మరో ముఖ్యమైన ప్రయోజనమని పేర్కొన్నారు.

పర్యావరణానికి మేలు చేసే వినూత్న విధానం:డీఆర్డీవో సాయన్న

డీఆర్డీవో సాయన్న మాట్లాడుతూ.. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఆలూరు, మునిపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మ్యాజిక్ డ్రైనేజీ ద్వారా మురుగునీరు, వర్షపు నీరు భూమిలోనికి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయని, నిర్మాణ వ్యయం కూడా తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర గ్రామాల్లో కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

Next Story