విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి అడ్లూరి

by Kodari Anjali |

నల్లమల అభివృద్ధికి రూ.12.70 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి అండ్లూరి లక్ష్మణ్ శంకుస్థాపన చేశారు.

విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి అడ్లూరి
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అండ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు. నల్లమల ప్రాంతంలో రూ.12.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. మారుమూల నల్లమల ప్రాంతంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.

గతంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా..

రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి కల్పించని విధంగా విద్యా రంగంపై నల్లమల్ల ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.

సస్పెన్షన్ రద్దుకు చర్యలు..

పీవీటీజీ గురుకుల బాలుర పాఠశాల సస్పెన్షన్‌కు గురైన వారిని రేపటిలోగా తిరిగి విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఆశ్రమ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను త్వరలోనే భర్తీ చేసి, విద్యార్థుల బోధనకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని తెలిపారు. నల్లమల ప్రాంతంలో ఎంతో ప్రతిభ దాగి ఉందని, ఇక్కడి విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అమ్రాబాద్ లో మార్కెట్ యార్డ్ పరిధిలో రూ. కోటి నిధులతో సిసి రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు.

మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి.. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

నల్లమలకు మంచి పేరు తీసుకురావడంతో పాటు, “మట్టిలో మాణిక్యాల” వంటి ప్రతిభావంతులను వెలికితీయాలని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు సరైన మార్గదర్శనం, ప్రోత్సాహం అందిస్తే నల్లమల నుంచి ఎంతో మంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లమల ప్రాంత విద్యార్థుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. రూ.12.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే నల్లమల ప్రాంతంలో విద్యా, సంక్షేమ రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభించడంతో పాటు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా అదనపు కలెక్టర్ దేవసాయం, ఆర్డీవో ఇన్చార్జి ఐ టి డి ఏ పిఓ యాదగిరి, ఇంజనీరింగ్ శాఖ ఎస్ఈ బాలు, ఎస్ ఈ హేమలత, ఈ ఈ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ మంజుల రాజు, ఉపసర్పంచ్ రమణ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రహీం, నాయకులు దాసరి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత మల్లేష్, మార్కెట్ కమిటీ కార్యదర్శి నర్సింలు, సత్యనారాయణ, వెంకటరమణ, అనిల్ కుమార్, ఆనంద్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story