భార్యకు ఉరేసి అత్తమామలకు వీడియో కాల్.. భర్త రాక్షసానందం

by Prasad Jukanti |   (  Updated:2026-07-28 09:00:33  IST  )

కర్ణాటకలో దారుణం జరిగింది. భార్యకు ఉరేసి ఆమె ప్రాణాలు పోతున్న దృశ్యాలను అత్తమామలకు వీడియో కాల్ చేసి చూపించాడో ఉన్మాది భర్త.

భార్యకు ఉరేసి అత్తమామలకు వీడియో కాల్..  భర్త రాక్షసానందం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాగా చూసుకుంటానని నమ్మించి పుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చిన ఓ భర్త ఆమెను ఉరేసి చంపేశాడు. ఉరితాడు మెడకు బిగుసుకుని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా ఏ మాత్రం కనికరం లేకుండా తన అత్తమామలకు వీడియో కాల్ చేసి మీ కూతురు ప్రత్యక్ష నరకాన్ని ఇదిగో అంటూ ఆ దారుణాన్ని చూయిస్తూ రాక్షసానందం పొందాడు. క్రూరత్వాన్ని నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‍కోట్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం.. మృతురాలు భాగ్యశ్రీ జిగళూరు (23), ప్రవీణ్ జిగళూరు భార్య భర్తలు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తన భార్యను ప్రవీణ్ నిత్యం వేధిస్తుండే వాడు. అతడి బాధలు భరించలేక రెండు నెలల క్రితం భాగ్యశ్రీ పుట్టింటికి వెళ్లిపోయింది.

నమ్మించి తీసుకొచ్చి దారుణం:

గత ఆదివారం తన భార్య వద్దకు వెళ్లిన ప్రవీణ్ అక్కడ తన అత్తమాలు, భార్యను నమ్మించాడు. ఇకపై ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉందామని మాట ఇచ్చి అదే రోజు సాయంత్రం ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే మళ్లీ నీకు ఇతరులతో ఎఫైర్ ఉందంటూ భాగ్యశ్రీతో ప్రవీణ్ గొవకు దిగాడు. ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన ప్రవీణ్.. భాగ్యశ్రీపై ఓ కర్రతో దాడి చేశాడు. అనంతరం బెడ్‌రూమ్‌లో దుప్పటాతో ఫ్యాన్‌కు ఉరివేశాడు.

అత్తమామలకు వీడియో కాల్.. బంధువులకు వీడియో షేర్:

భాగ్యశ్రీ ఉరితాడుకు వేలాడుతుండగా ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మీ కూతురు చావును కళ్లారా చూడాలంటూ ఆ ఘోరాన్ని చూయించాడు. అంతటితో అదంతా వీడియో రికార్డు చేసి తన బంధువులు, స్నేహితులకు పంపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Next Story