- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షల పర్యవేక్షణ
పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ల్యాబ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ల్యాబ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలను ఈ కంట్రోల్ సెంటర్ ద్వారానే అధికారులు లైవ్ లో పర్యవేక్షించనున్నారు. గతేడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు కొన్ని ప్రైవేటు కాలేజీల కెమెరాలను మాత్రమే బోర్డుకు అనుసంధానించారు. ఈ సారి అన్ని ప్రైవేటు కాలేజీలను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీంతో పరీక్షల టైం లో ఎక్కడైనా మాస్ కాపీయింగ్ జరిగినా, నిబంధనలు ఉల్లంఘించినా క్షణాల్లో తెలిసిపోతుంది. ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు శనివారం ఇంటర్ బోర్డు కార్యదర్శి క్రుష్ణ ఆదిత్య తెలిపారు
ఏర్పాట్లు పూర్తి..
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (టీజీబీఐఈ) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ పరీక్షలు ప్రతి రోజు రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం సెషన్ 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో జనరల్, వొకేషనల్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం 5,26,192 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ఎంపీసీ నుంచి 2,74,007 మంది, బైపీసీ నుంచి 1,33,415 మంది, వృత్తి విద్య కోర్సుల నుంచి 1,18,770 మంది విద్యార్థులు ఉన్నారు.
పది జిల్లాలకు హైపవర్ కమిటీలు..
పరీక్షల కోసం మొత్తం 7,559 మంది ఎగ్జామినర్లను నియమించారు. సిబ్బంది నియామక ఉత్తర్వులను, వారికి అందజేయాల్సిన చెల్లింపులను సీజీజీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. పరీక్షల పర్యవేక్షణకు 10 జిల్లాలకు హై పవర్ కమిటీలు, 33 జిల్లాలకు జిల్లా పరీక్షా కమిటీలతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను కళాశాల లాగిన్‌ల ద్వారా లేదా బోర్డు అందించే లింక్ ద్వారా పొందవచ్చు. ఏదైనా సందేహాలు లేదా సమాచారం కోసం విద్యార్థులు 92402 05555 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(ఐవీఆర్) సేవలను ఉపయోగించుకోవచ్చని బోర్డు వెల్లడించింది.






