బంగారం కొనడం మానేద్దాం : దేశ ప్రజలకు మోడీ పిలుపు

by Muthe.Rajitha |

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ యుద్ధాలు గ్లోబల్ సప్లై చైన్ ను ఎలా దెబ్బతీశాయో పేర్కొన్నారు.

బంగారం కొనడం మానేద్దాం : దేశ ప్రజలకు మోడీ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ యుద్ధాలు గ్లోబల్ సప్లై చైన్ ను ఎలా దెబ్బతీశాయో పేర్కొన్నారు. ముఖ్యంగా దేశీయంగా బంగారం వినియోగంపై ప్రధాని దేశప్రజలకు కీలక రిక్వెస్ట్ చేశారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ తరుణంలో ప్రజలు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని ఆయన కోరారు. పండుగలు, శుభకార్యాల కోసం చేసే భారీ కొనుగోళ్లను తగ్గించడం వల్ల దేశం నుండి బయటకు వెళ్లే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, అది దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. కేవలం బంగారం మాత్రమే కాకుండా, విదేశీ పర్యటనలు, విదేశాల్లో నిర్వహించే 'డెస్టినేషన్ మ్యారేజ్'లను కూడా తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి విదేశీ ఖర్చులను తగ్గించుకుని, ఆ నిధులను దేశీయ మార్కెట్లోనే వినియోగించడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ప్రధాని తన ప్రసంగంలో నొక్కి చెప్పారు.

వంటనూనెలకు నో..

వంటనూనెలు, ఎరువుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ మార్కెట్‌లో ఎరువుల ధరలు భారీగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి రైతులకు తక్కువ ధరకే యూరియా అందిస్తోందని, అయితే రైతులు కూడా భూసారాన్ని కాపాడేందుకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. ప్రతి భారతీయుడు స్వదేశీ వస్తువులనే వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేయాలని, దిగుమతులపై ఆధారపడటం తగ్గితేనే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా "ఆత్మనిర్భర్ భారత్" లక్ష్యాన్ని చేరుకోవచ్చని ప్రధాని మోదీ ఈ సభ వేదికగా ప్రజలకు దిశానిర్దేశం చేశారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వండి

పొరుగు దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, భారత్‌లో ఆ ధరల భారం సామాన్యుడిపై పడకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు. చమురు దిగుమతులపై మనం పెట్టే ఖర్చు దేశ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతోందని, అందుకే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. దీనికి ప్రత్యామ్నాయంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం, రైల్వేలలో డీజిల్ వాడకాన్ని తగ్గించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పాటించడం వంటి చర్యల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story