- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరి ఉత్పత్తి జరిగే 20 ప్రాంతాల్లో ఆధునిక ధాన్యం సైలోలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వరి ఎక్కువ ఉత్పత్తి చేసే జిల్లాలోని 20 ప్రాంతాల్లో అత్యాధునిక సైలోల ఏర్పాటుపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు, మొదట దశలో 50 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో సైలోల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసే అవకాశాలను అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సైలోల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, నిల్వ సామర్థ్యాలు, పెట్టుబడి వ్యయం, అమలు విధానాలపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సంబంధిత సంస్థలను ఆదేశించారు. ధాన్యం నిల్వ వ్యవస్థను మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
శుక్రవారం సచివాలయంలో ధాన్యం నిల్వ, రవాణా రంగానికి చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వరి ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు ప్రతి ఏడాది పెరుగుతుండటంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిల్వ సామర్థ్యాలను కూడా పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సైలోలు ప్రస్తుతం అమలులో ఉన్న ధాన్యం కొనుగోలు, నిల్వ వ్యవస్థలకు ప్రత్యామ్నాయం కాదని, వాటికి అనుబంధంగా పనిచేసే ఆధునిక మౌలిక వసతులుగా ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో స్వయం సహాయక సంఘాలు, ఇకేపీ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని భవిష్యత్తులో కూడా వారి పాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు వ్యవస్థను కొనసాగిస్తూనే ఆధునిక సాంకేతికతను అనుసంధానం చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలు, నిల్వ కేంద్రాల వద్ద ఉండే కార్మికుల కొరత, రవాణా ఆలస్యం సమస్యలకు ఈ వ్యవస్థ పరిష్కారం చూపగలదని అభిప్రాయపడ్డారు. రైల్వే అనుసంధానంతో కూడిన ఆధునిక లాజిస్టిక్స్ వ్యవస్థ ద్వారా ధాన్యాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశవ్యాప్తంగా వినియోగ కేంద్రాలకు వేగంగా తరలించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న సాంకేతిక నిపుణులు ఆధునిక సైలోల ద్వారా ధాన్యం స్వీకరణ నుంచి నిల్వ, రవాణా ప్రక్రియను ఆటోమేటెడ్ పద్ధతిలో నిర్వహించవచ్చని వివరించారు. డిజిటల్ నాణ్యత పరీక్షలు, యాంత్రిక అన్‌లోడింగ్, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ, శాస్త్రీయ నిల్వ విధానాల ద్వారా ధాన్య నాణ్యతను దీర్ఘకాలం కాపాడవచ్చని తెలిపారు.






