ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐటీఐలో ఆధునిక కోర్సులు: మంత్రి వివేక్ వెంకటస్వామి

by Malleboina Mahesh |

పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువత మల్టీ స్కిల్డ్ కావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఏటీసీల్లో కొత్త కోర్సులు, జాబ్ మేళాలపై కీలక ప్రకటన.

ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐటీఐలో ఆధునిక కోర్సులు: మంత్రి వివేక్ వెంకటస్వామి
X

దిశ, తెలంగాణ బ్యూరో : యువతకు ఆధునిక నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ లో భాగంగా మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ లో స్వల్పకాలిక కోర్సులు ప్రారంభిచారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను దశలవారీగా అమలు చేస్తున్నామన్నారు.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన యువత అందుబాటులో లేరని అనేక పరిశ్రమలు చెబుతున్నాయని, అందుకే ఇండస్ట్రీలకు అవసరమైన స్కిల్ సెట్స్పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏటీసీలు, ఐటీఐలు భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన శిక్షణ పొందిన నిపుణులను తయారు చేస్తున్నాయని పేర్కొన్నారు. నేటి ప్రపంచంలో ఒక్క నైపుణ్యం సరిపోదని, యువత మల్టీ స్కిల్డ్ ఉంటేనే అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు.

ఏటీసీల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణా విధానం ఉండాలని ప్రిన్సిపాల్స్‌కు సూచిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన కోర్సులను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రపంచం తో పోలిస్తే వ్యవసాయ రంగంలో మన ఉత్పాదకత తక్కువగా ఉన్నందున అగ్రి అలైడ్ సెక్టార్‌లో నైపుణ్యాలను పెంచే కార్యక్రమాలు చేపడతామన్నారు. జీనోమ్ వ్యాలీ ప్రాంతంలోని పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడి పరిశ్రమలకు అవసరమైన కోర్సులను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.

విద్యార్థులు జీవితంలో విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలని, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అదేవిధంగా టామ్‌కామ్ ద్వారా విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ అందిస్తున్నామని, విదేశాల్లో మెరుగైన వేతనాలతో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏటీసీల నుంచి ఇప్పటికే పలువురు విద్యార్థులు ఉద్యోగాల్లో చేరుతున్నారని, భవిష్యత్తులో జిల్లాల వారీగా జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, డైరెక్టర్ కాంతి వెస్లీ, అధికారులు, ట్రైనర్లు పాల్గొన్నారు.

Next Story