- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MMTS ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి హైదరాబాద్ నగర వాసులకు MMTS సేవలు ఉచితంగా అందించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం MMTS ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి హైదరాబాద్ నగర వాసులకు MMTS సేవలు ఉచితంగా అందించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసే లక్ష్యంతో ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లలో ఈ ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పథకాన్ని ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని, ప్రయాణికుల టికెట్ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 16న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించిన ప్రభుత్వం, అధికారికంగా దక్షిణ మధ్య రైల్వేకు (SCR) ప్రతిపాదనలను పంపింది.
ఈ ప్రతిపాదనపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే, పథకం అమలుకు సంబంధించి ముసాయిదా ఎంవోయూను (MoU) పంపాలని ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్ దీనిపై ప్రత్యుత్తరం ఇస్తూ.. ప్రభుత్వం పంపే ముసాయిదాను పరిశీలించి, తుది అనుమతి కోసం రైల్వే బోర్డుకు పంపిస్తామని తెలిపారు. రైళ్ల సంఖ్య, వేళలు మరియు స్టేషన్ల నిర్వహణ వంటి అంశాలను రైల్వే బోర్డు నిబంధనల ప్రకారమే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. అయితే, గతంలో పెండింగ్‌లో ఉన్న ఎంఎంటీఎస్-2వ దశ నిధులు రూ. 491.45 కోట్లను కూడా వెంటనే విడుదల చేయాలని రైల్వే శాఖ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఈ ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వస్తే, హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్, ఇతర ప్రధాన ప్రాంతాల మధ్య ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులతో పాటు ఎంఎంటీఎస్‌ను కూడా ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేలా చేయడమే ఈ పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే, జూన్ 2 నుంచి భాగ్యనగర వాసులకు లోకల్ రైలు ప్రయాణం ఉచితం కానుంది. ఇది నగర రవాణా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పుగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.






