- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండింగ్ ప్రాజెక్టులపై ఎంఎంసీ నజర్
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై మేడ్చల్–మల్కాజ్‌గిరి కార్పొరేషన్ (ఎంఎంసీ) ప్రత్యేక దృష్టి సారించింది.

దిశ, మేడ్చల్ బ్యూరో : పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై మేడ్చల్–మల్కాజ్‌గిరి కార్పొరేషన్ (ఎంఎంసీ) ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఏఓసీ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం తార్నాకలోని ఎంఎంసీ కార్యాలయంలో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓసీ ప్రాజెక్టుకు సంబంధించి రక్షణ శాఖ భూమికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5.78 ఎకరాల భూమి కేటాయింపు, షామీర్‌పేట్‌లోని ఎల్‌ఎల్‌ఆర్ ప్రాంతంలో 153 ఎకరాల భూమి బదిలీ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌కు వెంటనే లేఖ పంపాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. అలాగే ఏఓసీ పనుల ప్రారంభానికి అవసరమైన రైల్వే భూముల సేకరణ, భూసేకరణ విధానంపై అధికారులతో సవివరంగా చర్చించారు. ఎంఎంసీ నూతన భవన నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌పై కన్సల్టెంట్‌తో రెండు రోజుల్లో సమావేశం నిర్వహించాలని సూచించారు. టికెఆర్ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే ఆస్తులపై కూడా సమీక్ష నిర్వహించారు. తక్కువ ప్రభావం ఉండే ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తిస్తూ, నిర్మాణాల స్వభావం ఆధారంగా జాబితా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
టీడీఆర్ స్వీకరణకు ముందుకు వచ్చిన యాజమానులు..
సమావేశానికి హాజరైన ప్రభావిత భవన యజమానులతో కమిషనర్ చర్చించారు. వారిలో పలువురు టీడీఆర్ స్వీకరించేందుకు అంగీకరించి, అవసరమైన భవన భాగాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. టీడీఆర్ స్వీకరించేందుకు ముందుకు వచ్చిన యజమానులకు ఎల్‌బీ నగర్ జోనల్ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్‌తో కలిసి పూర్తి సహకారం అందిస్తామని, టీడీఆర్ జారీ ప్రక్రియను వేగవంతం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఆర్‌కే పురం ఆర్‌ఓబీ నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే ఆస్తులపై కూడా సమీక్ష నిర్వహించి, టీడీఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. మొత్తం 34 మంది ఆస్తి యాజమానులు టీడీఆర్ స్వీకరించేందుకు అంగీకరించగా, వారికి త్వరలోనే టీడీఆర్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి..
ఉప్పల్ ఫ్లైఓవర్‌కు సంబంధించి మిగిలిన ఫౌండేషన్ పనులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, భూసేకరణ పురోగతిపై వివరించారు. ముఖ్యంగా రామంతాపూర్ వైపు ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన సర్వే ఆఫ్ ఇండియా భూమి సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్, సిటీ ప్లానర్లు, భూసేకరణ అధికారి, ఇంజినీరింగ్ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.






