దిశ ఎఫెక్ట్ : కబ్జాకు గురైన వరద కాలువ పరిశీలన

by Batti.Sumithra |

ప్రకృతి జల వనరులైన చెరువులు, వరద కాలువలు, సహజ నీటి ప్రవాహ మార్గాలను అక్రమంగా ఆక్రమించి గోడలు నిర్మించడం పై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు తీవ్రంగా స్పందించారు.

దిశ ఎఫెక్ట్ : కబ్జాకు గురైన వరద కాలువ పరిశీలన
X

దిశ, ఝరాసంగం : ప్రకృతి జల వనరులైన చెరువులు, వరద కాలువలు, సహజ నీటి ప్రవాహ మార్గాలను అక్రమంగా ఆక్రమించి గోడలు నిర్మించడం పై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు తీవ్రంగా స్పందించారు. మంగళవారం దిశ దినపత్రికలో ప్రచురితమైన "బరితెగింపు.. వరద కాలువ కబ్జా" కథనం పై స్పందించిన ఎమ్మెల్యే, ఝరాసంగం మండలం పొట్టిపల్లి గ్రామ శివారులోని ఫామ్‌ల్యాండ్ పేరుతో చెరువు దిగువ భాగంలో ఉన్న వరద కాలువను పూర్తిగా ఆక్రమించిన విషయాన్ని గ్రామస్తుల నుంచి తెలుసుకున్నారు. ఈ సమస్య పై గత మే 19న గ్రామస్తులు అధికారులకు వినతిపత్రం సమర్పించినప్పటికీ స్పందన లేకపోవడంతో, మంగళవారం దిశలో ప్రచురితమైన కథనాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం గ్రామస్తులతో కలిసి కబ్జాకు గురైన వరద కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే, జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. "ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగేలా కాలువలను ఆక్రమిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ?" అని అధికారులను ప్రశ్నించారు. వెంటనే సర్వే నిర్వహించి, ఆక్రమణలను తొలగించి, వరద కాలువను యథాస్థితికి తీసుకువచ్చి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశం, సర్పంచ్ శ్యామల మొగులయ్య, సిద్ధన్న పాటిల్‌, విష్ణు గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story