సమస్యల సుడిలో ప్రభుత్వ బడి

by Ratna Kumari |

విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకున్న వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ విద్యాసంస్థలు పలు సమస్యలతో సతమతమవుతున్నాయి.

సమస్యల సుడిలో ప్రభుత్వ బడి
X

దిశ, గంభీరావుపేట : విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకున్న వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ విద్యాసంస్థలు పలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమితో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని 12 జెడ్పీహెచ్‌ఎస్‌లు, 31 ప్రాథమిక పాఠశాలలు కలిపి మొత్తం 43 ప్రభుత్వ పాఠశాలల్లో 3,294 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నిబంధనల ప్రకారం 221 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 198 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో 23 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధనపై ప్రభావం పడుతోంది. దోసలగూడెం, ముచ్చర్ల, ముస్తఫానగర్, మల్లారెడ్డిపేట, లింగన్నపేట తండా పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడలు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. లింగన్నపేట, గోరంటాల పాఠశాలల్లో కనీస మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడంతో విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా కొత్తపల్లి ఎస్సీ కాలనీ పాఠశాల భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపడుతుండటంతో విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, డిప్యూటేషన్ల కారణంగా అనేక పాఠశాలల్లో సిబ్బంది కొరత ఏర్పడిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

సత్తా చాటుతున్న విద్యార్థులు.. అయినా పట్టించుకోని సర్కారు..

ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ గంభీరావుపేట మండల విద్యార్థులు విద్యా ఫలితాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షల్లో 536 మంది విద్యార్థుల్లో 519 మంది ఉత్తీర్ణత సాధించారు. అంతేకాకుండా ఏడుగురు విద్యార్థులు ప్రతిష్టాత్మక త్రిబుల్ ఐటీ సీట్లు సాధించి ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను నిలబెట్టారు. మండలంలోని నర్మాల గ్రామ పాఠశాలలో పలువురు ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించే పరిస్థితి లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు లేకుండా పిల్లలను పాఠశాలకు పంపడం వృథా అవుతోందని, వెంటనే జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నర్మాల గ్రామస్థులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తేనే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయని విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Next Story