బోరుబావిలో పడిన చిన్నారి.. ఆర్మీ, NDRF హై రెస్క్యూ ఆపరేషన్

by Muthe.Rajitha |

హరియాణా రాష్ట్రం అంబాలా పరిధిలోని ధనౌరా గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

బోరుబావిలో పడిన చిన్నారి.. ఆర్మీ, NDRF హై రెస్క్యూ ఆపరేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : హరియాణా రాష్ట్రం అంబాలా పరిధిలోని ధనౌరా గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్భయ్ అనే నాలుగేళ్ల చిన్నారి తన తండ్రితో కలిసి, పొలంలో ఉన్న తాతకు భోజనం అందించడం కోసం వెళ్లాడు. తండ్రి, తాత ఇద్దరూ పొలం పనుల్లో మునిగిపోయిన సమయంలో.. ఆ బాలుడు పక్కనే ఉన్న బోరుబావి వద్దకు వెళ్లి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. బాలుడు బోరుబావిలో పడటాన్ని గమనించిన తండ్రి, స్థానిక రైతులు హుటాహుటిన అక్కడికి చేరుకుని స్వయంగా రక్షించే ప్రయత్నం చేశారు. కానీ, అది సాధ్యం కాకపోవడంతో తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు.

220 అడుగుల లోతులో బాలుడు

ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితులను సమీక్షించగా, ఆ చిన్నారి దాదాపు 220 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు గుర్తించారు. అంతటి లోతులో ఉన్న బాలుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అధికారులు పైపుల ద్వారా బోరుబావిలోకి నిరంతరం ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. అలాగే లోపల బాలుడి కదలికలను గమనించేందుకు ప్రత్యేక కెమెరాలను కూడా లోపలికి పంపించారు.

ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ హై రెస్క్యూ ఆపరేషన్

చిన్నారి నిర్భయ్‌ను ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకురావడానికి యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ప్రస్తుతం స్థానిక పోలీసులతో పాటు భారత ఆర్మీ, NDRF సిబ్బంది ఉమ్మడిగా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. బోరుబావికి సమాంతరంగా జెసిబిల సాయంతో పక్కనే మరో గుంతను తవ్వుతూ బాలుడిని బయటకు తీయాలనే వ్యూహంతో సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి. కొడుకు బోరు బావిలో చిక్కుకుపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి సురక్షితంగా బయటకు రావాలని స్థానికులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Next Story