డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం : జోనల్ కమిషనర్

by Batti.Sumithra |

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం : జోనల్ కమిషనర్
X

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం నియమించిన ఎన్‌సీపీఈ కన్సల్టెంట్ ప్రతినిధులతో కలిసి జోన్ పరిధిలోని డ్రైనేజీ ప్యాటర్న్, ఫ్లో హైడ్రాలిక్స్‌పై సమీక్షించారు. డ్రైనేజీ నెట్‌వర్క్ మ్యాపింగ్, జోన్‌లోని ప్రధాన, అనుబంధ నాలాల ప్రస్తుత పరిస్థితి, నీటి ప్రవాహ సామర్థ్యం పై ఎన్‌సీపీఈ సమర్పించిన సాంకేతిక నివేదికను పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాల్లో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పై చర్చించారు.

హైడ్రాలిక్ డిజైన్, ప్రస్తుత డ్రైన్ల సామర్థ్యం (కెపాసిటీ), నీటి ప్రవాహ వేగం, అవరోధాల తొలగింపుపై ఇంజనీరింగ్ విభాగానికి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ పలు సూచనలు చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా స్టార్మ్ వాటర్ డ్రైన్ల అభివృద్ధి, మిస్సింగ్ లింక్‌ల పూర్తి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ, వేగంగా జరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం, వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పెండింగ్ పనులను గుర్తించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఈ శ్రీలక్ష్మి, ఎస్‌ఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story