దారుణం.. మైనర్ నిందితుల చేత లైంగిక చర్యలు.. SI అరెస్ట్

by Prasad Jukanti |

ఓ హత్య కేసు దర్యాప్తు పేరుతో మైనర్ నిందితులను నిర్బంధించి, లైంగిక చర్యలు చేయించిన ఎస్ఐని పోలీసులు అరెస్ట్ చేశారు.

దారుణం.. మైనర్ నిందితుల చేత లైంగిక చర్యలు.. SI అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మైనర్ నిందితులతో ఓ ఎస్ఐ నిర్వాకం బట్టబయలైంది. హత్యకేసులో దర్యాప్తు పేరుతో మైనర్ నిందితులను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా వారితో లైంగిక పనులు చేయించడం కలకలం రేపింది. బెంగళూరులో వెలుగు చూసిన ఈ ఘటనలో కొత్తనూరు పోలీస్ స్టేషన్‌ ఎస్ఐ‍ని ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. పోలీసు వర్గాల కథనం ప్రకారం గతేడాది నమోదైన ఓ హత్య కేసులో కొంత మంది మైనర్లతో కూడిన నిందితులను ఎస్ఐ ప్రవీణ్ విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నాడు. అయితే, నిబంధనల ప్రకారం వారిని ప్రభుత్వ అనుమతి పొందిన జువైనల్ అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచాల్సింది పోయి, ఒక ప్రైవేట్ ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించారు.

బెల్ట్ తో కొడుతూ..

అక్రమంగా తన నిర్బంధంలో ఉంచుకున్న ఎస్ఐ ప్రవీణ్.. ఆ మైనర్లపై తీవ్రంగా దాడి చేశాడు. బెల్ట్ తో విచక్షణారహితంగా కొట్టడంతో పాటు ఒక మైనర్ బాలుడితో మరొక మైనర్ బాలుడిపై బలవంతంగా లైంగిక చర్యలు చేయించాడు. ఈ దారుణాలను సదరు అధికారి తన మొబైల్‍లోనే స్వయంగా రికార్డు చేశాడు. అయితే ఈ అరాచకానికి సంబంధించిన వీడియో క్లిప్ ఇటీవల సీనియర్ పోలీసు అధికారుల దృష్టికి రావడంతో షాక్ తిన్న పై అధికారులు ఈ ఘటనలో ఎస్ఐపై కఠిన చర్యలకు ఆదేశించారు. దీంతో సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను అత్యంత కఠినమైన పోక్సో (POCSO) చట్టంలోని పలు సెక్షన్లతో పాటు చట్టవిరుద్ధమైన దాడి, వేధింపులకు సంబంధించిన ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన పీఎస్ఐ ప్రవీణ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఈ ఘటన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story