సర్ అప్లికేషన్ పేరుతో మోసం.. పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు

by Batti.Sumithra |

ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ అప్లికేషన్ కోసం ఫోటో తీస్తామని నమ్మించి గుర్తుతెలియని దుండగులు మహిళకు చెందిన సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటన బీబీనగర్ పట్టణ కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

సర్ అప్లికేషన్ పేరుతో మోసం.. పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ అప్లికేషన్ కోసం ఫోటో తీస్తామని నమ్మించి గుర్తుతెలియని దుండగులు మహిళకు చెందిన సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించిన ఘటన బీబీనగర్ పట్టణ కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం బీబీనగర్ పట్టణానికి చెందిన కుక్కుదోవు అండాలు వద్దక ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చారు. ప్రభుత్వ 'సర్' అప్లికేషన్ కోసం ఫోటో తీస్తామని చెప్పి, ఫోటోలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మెడలో ఉన్న పుస్తెలతాడును తీసి భర్తకు ఇవ్వాలని సూచించారు. వారి మాటలు నమ్మిన మహిళ పుస్తెలతాడును తీసి తన భర్త చేతికి ఇచ్చింది. అనంతరం ఆ మహిళను ఫోటో తీసిన దుండగులు, అప్లికేషన్‌ను సమీపంలోని ఆలయం వద్ద ఉన్న అధికారుల వద్ద పూర్తి చేయాలని చెప్పి ఆమెను అక్కడి నుంచి కొంత దూరం తీసుకెళ్లారు. ఇదే సమయంలో వెనక్కి తిరిగిన దుండగులు బైక్ పై మహిళ భర్త వద్దకు చేరుకుని అతని చేతిలో ఉన్న బంగారు పుస్తెలతాడును తీసుకుని పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story