- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడిని కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా కొట్టిన దుండగులు
చుంచుపల్లి మండలంలోని రామాంజనేయ కాలనీలో ఓ యువకుడిపై పదిమంది వరకు ఉన్న ఆకతాయిలు దాడికి పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

దిశ, చుంచుపల్లి : చుంచుపల్లి మండలంలోని రామాంజనేయ కాలనీలో ఓ యువకుడిపై పదిమంది వరకు ఉన్న ఆకతాయిలు దాడికి పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం చుంచుపల్లికి చెందిన రాహుల్ తన స్నేహితులతో కలిసి కారులో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి చేరుకుని వారిపై దాడి చేశారు. అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రాహుల్‌ను బలవంతంగా బైక్ పై ఎక్కించి గాంధీ కాలనీలోని గ్యాస్ గోదాం సమీపానికి తీసుకెళ్లి కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు.
స్నేహితుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై రాహుల్ చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి రావడంతో మండల ప్రజల్లో ఆందోళన నెలకొంది. స్థానికుల అభిప్రాయం ప్రకారం, ఇటీవల మళ్లీ రౌడీ మూకల అల్లర్లు, పాత కక్షల నేపథ్యంలో దాడులు పెరుగుతున్నాయని చెబుతున్నారు. చిన్నచిన్న వివాదాలను పెద్ద గొడవలుగా మార్చి యువకులు హింసాత్మక ఘటనలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అదే విధంగా, కొందరు యువకులు గంజాయి వంటి మత్తు పదార్థాల ప్రభావంతో విచక్షణ కోల్పోయి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ప్రత్యేక పోలీసు గస్తీ ఏర్పాటు చేసి, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని, మండలంలో శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలు పోలీసు అధికారులను కోరుతున్నారు.






