పుర‘పోరు’ను లైట్ తీసుకుంటున్న మంత్రులు.. సర్కారుకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్టు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-24 01:37:21  IST  )

మున్సిపల్ ఎన్నికలను సగం మంది మంత్రులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పుర‘పోరు’ను లైట్ తీసుకుంటున్న మంత్రులు.. సర్కారుకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్టు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలను సగం మంది మంత్రులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. లోక్ సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించి వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు సగం మంది మంత్రులు మాత్రమే రంగంలోకి దిగారు. ఫీల్డ్‌లోకి వెళ్లి పార్టీ కేడర్‌తో సమావేశాలు నిర్వహించారు. అయితే మిగతా మంత్రులు ఫీల్డ్‌లో వెళ్లేందుకు అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

హైదరాబాద్ దాటని మంత్రులు!

మేడారంలో ఈనెల 18న కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి లోక్ సభ నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్ చార్జిలుగా నియమించారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేలోపు క్షేత్ర స్థాయిలో పర్యటించి పార్టీ పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వాలని టార్గెట్ పెట్టారు. మంత్రులు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలోని లీడర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి, పార్టీ పరిస్థితులు, పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల జాబితాను పీసీసీకు అందించాల్సి ఉన్నది. కానీ సగం మంది మంత్రులు ఇప్పటివరకు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో పర్యటించలేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల బాధ్యతలు తీసుకునేందుకు కొందరు మంత్రులు అయిష్టంగా ఉన్నారని, అందుకే తమకు అప్పగించిన ఏరియాల్లో పర్యటించడం లేదని చర్చ జరుగుతున్నది. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించని మంత్రులు.. కింది స్థాయి లీడర్లకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారని పీసీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇతర పనులతో బిజీగా ఉంటూ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు టైం కుదరపోతే ఇబ్బంది లేదు కానీ.. కొందరు మంత్రులు మాత్రం హైదరాబాద్ లో ఉంటూ కాలయాపన చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

మంత్రుల పర్యటనపై ఆరా..

ఇప్పటివరకు ఏ మంత్రి ఎక్కడ పర్యటించారు? ఎక్కడ సమన్వయం సమావేశం నిర్వహించారు? ఎందరి అభిప్రాయాలు తీసుకున్నారు? అనే కోణంలో నిఘా వర్గాలు సమాచారం సేకరిస్తున్నాయి. శుక్రవారం వరకు కేవలం సగం మంది మంత్రులు మాత్రమే తమకు అప్పగించిన పార్లమెంట్ నియోజకవర్గాల్లోని లీడర్లతో సమావేశం నిర్వహించినట్లు ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిసింది. ఇంతవరకు సమన్వయ సమావేశం నిర్వహించని మంత్రులకు పీసీసీ వర్గాలు ఫోన్ చేసి ‘షెడ్యూలు వచ్చేలోపు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహుల జాబితా స్క్రూట్నీ చేయాలి. త్వరగా మీటింగ్ పెట్టి రిపోర్టు ఇవ్వండి’అని రిక్వెస్టు చేస్తున్నట్లు సమాచారం.

2న సీఎం, మీనాక్షి నటరాజన్ రివ్యూ..?

విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి ఒకటో తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు. రెండో తేదీన పార్టీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ తో కలిసి మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఆ మీటింగులోనే పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఇన్ చార్జి మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఫిబ్రవరి మూడు నుంచి వరుసగా ఆరు రోజుల పాటు సీఎం ఎన్నికల ప్రచారం కోసం జిల్లాల్లో పర్యటించేందుకు షెడ్యూలు తయారు చేసుకున్నారు.

Next Story