- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోచుకోవడం.. దాచుకోవడం మీ నైజం.. హరీష్‌రావుపై మంత్రులు ఫైర్
సచివాలయంలో శుక్రవారం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్థులకు సదుపాయాల కల్పన కోసం చేపట్టిన కొనుగోలు ప్రక్రియపై హరీష్‌రావు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతో చేసినవని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం టెండర్ విలువ రూ.687.78 కోట్లు మాత్రమేనని, రూ.2 వేల కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే విచారణ సంస్థలకు ఇవ్వాలి, లేకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పారదర్శకంగా టెండర్లు..
టెండర్ ప్రక్రియ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా, జాతీయ స్థాయి పోటీ టెండర్ల ద్వారా నిర్వహించామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 27 బిడ్లు వచ్చాయని, టెక్నికల్ అర్హతలు, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన తర్వాత ఎల్-1 విధానంలో టెండర్లు ఖరారు చేశామని పేర్కొన్నారు. ఏ సంస్థకూ నామినేషన్ పద్ధతిలో పని ఇవ్వలేదని స్పష్టం చేశారు. గుజరాత్ కాంట్రాక్టర్ కథలు పూర్తిగా కల్పితమని తేల్చి చెప్పారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంస్థలు పోటీ పడి టెండర్లు దక్కించుకున్నాయని.. వాటిలో గుజరాత్ కంపెనీ అసలే లేదని తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థలకు అవకాశం..
విద్యార్థులకు అందించే టై, బెల్టులు, ఐడీ కార్డుల మొత్తం ఆర్డర్‌ను టీజీఎల్ఐపీసీకి అప్పగించామని మంత్రి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. యూనిఫాం వస్త్రం, కార్పెట్లు, దుప్పట్లు, బెడ్డింగ్ సామగ్రిలో గణనీయమైన వాటాను టీజీఎస్‌సీవోకు కేటాయించామన్నారు. నోటుబుక్‌ల సరఫరాను తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు అప్పగించిట్టు తెలిపారు. 14 వేల మంది మహిళా టైలర్లకు యూనిఫాం కుట్టు పనులు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. 27 లక్షల మంది విద్యార్థులకు తొలిసారి సమగ్ర సదుపాయాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది బకాయిలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్య పనుల కోసం కలెక్టర్లకు ప్రత్యేక నిధులు అందుబాటులో ఉంచామని చెప్పారు.
ఆధారాలుంటే బయటపెట్టాలి..
'రూ.687.78 కోట్ల టెండర్‌ను రూ.2 వేల కోట్ల కుంభకోణంగా చిత్రీకరించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం. కేంద్రీకృత కొనుగోలు విధానం వల్ల నాణ్యత, పారదర్శకత, సమయానికి సరఫరా సాధ్యమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుంది. హరీష్ రావు వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలి' అని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు.






