SIR ముసుగులో ఓటర్ల తొలగింపును తిప్పికొట్టాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

by Jakkula.Mamatha |

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గద్దెరాగడి MNR గార్డెన్స్‌లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా(SIR)పై బూత్ లెవల్ ఏజెంట్లతో గురువారం జరిగిన అవగాహన శిక్షణ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ పాల్గొన్నారు.

SIR ముసుగులో ఓటర్ల తొలగింపును తిప్పికొట్టాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
X

దిశ, మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గద్దెరాగడి MNR గార్డెన్స్‌లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా(SIR)పై బూత్ లెవల్ ఏజెంట్లతో గురువారం జరిగిన అవగాహన శిక్షణ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. SIR ముసుగు వేసుకొని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశంలో ఓటు చోరీ అంశంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో గళం విప్పారని గుర్తు చేశారు. SIR ప్రక్రియలో భాగంగా తెలంగాణలో జూన్‌ 25 నుంచి జూలై 26 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాలను పకడ్బందీగా పరిశీలించాలని, చనిపోయిన ఓటర్ల వివరాలు గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మెగా ప్రాజెక్టుల పేరుతో భారీ అప్పులు చేసి, కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా అమలు చేస్తోందని, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఏజెంట్లు ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలో త్వరలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని, కాకా ఫౌండేషన్ ద్వారా 2,500 బోర్‌వెల్లు ఏర్పాటు చేయడంతో పాటు తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నీటి ఎద్దడి ప్రాంతాల్లో 400 బోర్‌వెల్లు వేయించామని తెలిపారు.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో సిట్టింగ్ స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం SIR ముసుగులో ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. అలాగే నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 ATC సెంటర్ల ద్వారా 25 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. టామ్‌కామ్ (TOMCOM) ద్వారా మరో 10 వేల మంది యువతకు జర్మనీలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story